Friday, September 11, 2026
spot_imgspot_img

జిజిహెచ్ లో మోకీలు మార్పిడి ఆపరేషన్లకు ‘ఉన్నతి’ ద్వారా కోటి రూపాయలు

Must read

📰 Generate e-Paper Clip

గుంటూరు, 12 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు సర్వజన ఆసుపత్రిలో నిరుపేదలకు ఉచితంగా మోకీలు మార్పిడి ఆపరేషన్లు నిర్వహించేందుకు కోటి రూపాయల విలువైన ఇంప్లాంట్లు అందుకు తగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఉన్నతి ఫౌండేషన్ చైర్మన్, సీనియర్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ బూసిరెడ్డి నరేంద్ర రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు జిజిహెచ్ సూపరిండెంట్ డాక్టర్ జి దుర్గాప్రసాద్ తో డాక్టర్ నరేంద్ర రెడ్డి అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.

దశాబ్దం క్రితం జిజిహెచ్ లో ఉచిత మోకీలు మార్పిడి ఆపరేషన్ చేయించుకున్న వారు, వారి కుటుంబ సభ్యులతో బుధవారం జిజిహెచ్ లో గల ఎంసిహెచ్ బ్లాక్ లోని సమావేశ మందిరంలో ముఖాముఖి కార్యక్రమం అత్యంత ఆనందోత్సాహాల మధ్య జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ బూసిరెడ్డి నరేంద్ర రెడ్డి మాట్లాడుతూ, అప్పటి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ ఇచ్చిన స్ఫూర్తితో జిజిహెచ్ లో ఉన్నతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 125 మందికి ఉచితంగా మోకీలు మార్పిడి ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించడం జరిగిందన్నారు. ఇది తమకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. గుంటూరు మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్వి సుందరాచారి, జిజిహెచ్ సూపరిండెండెంట్ డాక్టర్ జి దుర్గాప్రసాద్ విజ్ఞప్తి మేరకు నిరుపేదల కోసం మరో కోటి రూపాయల విలువైన ఇంప్లాంట్లు, పరికరాలు,సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉన్నతి ఫౌండేషన్ ద్వారా అందించనున్నట్లు తెలిపారు. తానే స్వయంగా జిజిహెచ్ కి వచ్చి ఉచితంగా ఆపరేషన్లు నిర్వహిస్తానని ఈ అవకాశం తమకు కలిగిన అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. దేవాలయం లాంటి ప్రభుత్వ ఆసుపత్రిలో సేవ చేసుకునే భాగ్యం కలగడం గౌరవంగా భావిస్తున్నామని ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వ ఆసుపత్రిలో లేనటువంటి మౌలిక సదుపాయాలు మన దగ్గర ఉన్నాయని దీనికి ప్రిన్సిపాల్, సూపరిండెంట్ కృషి మరువలేనిదని డాక్టర్ నరేంద్ర రెడ్డి తెలిపారు. గుంటూరు మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్వి సుందరాచారి మాట్లాడుతూ, 125 మందికి మొకీలు మార్పిడి ఆపరేషన్లు జరిగితే ఒక్కరికి కూడా ఇన్ఫెక్షన్ లేకపోవడం సర్జన్ తాలూకా అంకితభావానికి నిదర్శనమని అన్నారు. ఆపరేషన్లు చేయించుకున్న వారు చేస్తున్న నృత్యాలు, కోలాటాలు చూస్తుంటే చిన్ననాటి ఆనంద క్షణాలు గుర్తుకు వస్తున్నాయని భావోద్వేగానికి గురయ్యారు.

జిజిహెచ్ సూపరిండెంట్ డాక్టర్ జి. దుర్గాప్రసాద్ మాట్లాడుతూ, నిరుపేదలకు ఉచితంగా ఆపరేషన్లు నిర్వహించేందుకు డాక్టర్ నరేంద్ర రెడ్డి చేస్తున్న కృషి ఎంతో అభినందనీయమని కొనియాడారు. రానున్న రోజుల్లో మోకీలు మార్పిడి ఆపరేషన్లు విజయవంతానికి తమ పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. అంతకుముందు దశాబ్దం క్రితం జిజిహెచ్ లో ఉచిత మోకీలు మార్పిడి చేయించుకున్న వారు, వారి కుటుంబ సభ్యులు తో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమం అత్యంత ఆనందోత్సాహాల మధ్య జరిగింది. మోకీళ్ల మార్పిడి చేయించుకున్న వారు వైద్యులతో కలసి నృత్యం కోలాటం వంటి కార్యక్రమాలతో ఆహ్లాదంగా గడిపారు. నిరుపేదలమైన తమకు నొప్పిలేని నడకను ఇచ్చిన డాక్టర్ నరేంద్ర రెడ్డికి, జిజిహెచ్ వైద్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిజిహెచ్ ఆర్థోపెడిక్ విభాగాధిపతి డాక్టర్ పి అనిల్ బాబు, ప్రొఫెసర్ లు డాక్టర్ ఎ అజయ్, డాక్టర్ కె శ్రీనివాసరావు, బిఎమ్ఆర్ గ్రూప్స్ చైర్మన్ బూసిరెడ్డి మల్లేశ్వర రెడ్డి, డాక్టర్ బూసిరెడ్డి దీప్తి రెడ్డి, డాక్టర్ బూసిరెడ్డి ఉన్నతి, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, పీజీలు తదితరులు పాల్గొన్నారు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest article

App Icon

Install Bharath Prathinidhi News App

Add to home screen for faster loading and latest updates.