గుంటూరు, 12 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఏ తల్లీ ప్రసవానికి ముందు, ప్రసవం తర్వాత ఎలాంటి ఇబ్బందులు పడకూడదనే సదుద్దేశంతో ప్రభుత్వం అధునాతన “తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్” వాహనాలను ప్రవేశపెట్టిందని గుంటూరు జిల్లా ఇన్‌చార్జ్, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.బుధవారం గుంటూరు నగరంలోని జిజిహెచ్ ప్రాంగణంలో గల కానూరి జింఖానా శిశు మరియు స్త్రీ ఆరోగ్య కేంద్రం వద్ద స్థానిక ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మరియు వైద్య బృందంతో కలిసి మంత్రి కందుల దుర్గేష్ ప్రతిష్టాత్మక తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలను జెండా ఊపి, కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.

ఈ సందర్భంగా స్వయంగా బాలింతను, నవజాత శిశువును వాహనం ఎక్కించి వారితో ఆత్మీయంగా మాట్లాడి ఇంటికి సాగనంపారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, నేషనల్ హెల్త్ మిషన్ మరియు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఈ సర్వీసులను పునరుద్ధరించామని,ప్రసవానంతరం బాలింతలను సురక్షితంగా ఇంటికి చేర్చడంతో పాటు, ప్రసవానికి ముందు చెకప్‌లు, హైరిస్క్ ప్రెగ్నెన్సీ కేసులు, మరియు తీవ్ర రక్తహీనతతో ఐరన్/సుక్రోజ్ ఇంజెక్షన్లు అవసరమైన గర్భిణులను ఆస్పత్రికి తీసుకురావడానికి ఈ వాహనాలు ఉపయోగపడతాయని వివరించారు. ఇవి పూర్తిగా బ్రాండ్ న్యూ ఏసీ వాహనాలని, ప్రయాణికుల భద్రత కోసం 6 ఎయిర్ బ్యాగ్‌లు, జీపీఎస్ ట్రాకింగ్, అత్యవసర సమయాల్లో సహాయం కోసం ఎస్ ఓ ఎస్ బటన్, 102 కాల్ సెంటర్ సదుపాయాలతో రూపొందించబడ్డాయని తెలిపారు. గర్భిణులు మరియు బాలింతలు 102 సంఖ్యకు కాల్ చేసి ఉచితంగా ఈ సేవలను పొందవచ్చని పేర్కొన్నారు.. ఏఎన్ఎం లు, పిహెచ్ఎసి సిబ్బంది సమన్వయంతో గర్భిణులను ఆసుపత్రికి తీసుకువచ్చి, క్షేమంగా తిరిగి ఇంటికి చేరుస్తారని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా నిన్న ప్రారంభమైన ఈ వినూత్న కార్యక్రమంలో భాగంగా నేడు గుంటూరు జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని, గుంటూరు జిల్లాకు 18 వాహనాలను కేటాయించి అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రి ప్రసవాలను ప్రోత్సహించడం మరియు మాతా, శిశు మరణాల రేటును గణనీయంగా తగ్గించడమే ‘ఆరోగ్యాంధ్రప్రదేశ్’ సాధనలో ప్రభుత్వ మూల ఉద్దేశమని అన్నారు.

ఈ కార్యక్రమం అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ రూపొందించిన “ఆరోగ్యకరదీపిక” పోస్టర్‌ను మంత్రి దుర్గేష్ ఆవిష్కరించారు. స్థానిక వైద్య సమస్యలపై పత్రికా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ, స్థానికంగా ఏదైనా సమస్య ఉంటే తక్షణమే పరిష్కరిస్తామని, వైద్యులు రోగులతో ఆప్యాయంగా మెలగాలని చెబుతూ సంజీవని ప్రజా ఆరోగ్య కార్యక్రమం ద్వారా ప్రజలకు అన్ని రకాల వైద్య సదుపాయాలు అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిజిహెచ్ సూపర్ఇంటెండెంట్ డా. దుర్గాప్రసాద్, డిఎంహెచ్ఓ కే. విజయలక్ష్మి, డిసిహెచ్ఎస్ డా. రంగారావు, గైనకాలజిస్ట్ డా. అరుణ, జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు మరియు ఆసుపత్రి వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


