Friday, September 11, 2026
spot_imgspot_img

నవ గుంటూరుకి నాంది

Must read

📰 Generate e-Paper Clip

రూ.53.76 కోట్లతో నగర రూపురేఖలు మార్చే సుందరీకరణ, అభివృద్ధి ప్రాజెక్టులకు జిఎంసి శ్రీకారం

ప్రధాన జంక్షన్లు, థీమ్ పార్క్ లు, నైబర్ హుడ్ పార్క్ లు, మిర్చి థీమ్ తో పార్క్, పబ్లిక్ టాయ్ లెట్స్ ఏర్పాటు

గుంటూరు నగర కమిషనర్ కె.మయూర్ అశోక్

గుంటూరు, 06 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు నగరాన్ని ఆధునిక మౌలిక వసతులు, పచ్చదనం మరియు మెరుగైన సౌకర్యాలతో కూడిన నవ గుంటూరుగా తీర్చిదిద్దే లక్ష్యంతో గుంటూరు నగరపాలక సంస్థ బృహత్తర ప్రణాళికను సిద్ధం చేసింది. ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించడం, రవాణా వ్యవస్థను క్రమబద్ధీకరించడం, పారిశుధ్యాన్ని బలోపేతం చేయడం మరియు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించడమే ధ్యేయంగా రూ.53.755 కోట్ల అంచనా వ్యయంతో 6 ప్రధాన విభాగాలలో నగరవ్యాప్త అభివృద్ధి పనులకు ప్రణాళికలు ఆమోదించబడ్డాయి.
ఈ సందర్భంగా నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ మాట్లాడుతూ కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ దిశా నిర్దేశం, జిల్లా కలెక్టర్, నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి సిఎం.సాయికాంత్ వర్మ మార్గదర్శకత్వం, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో భారీ ప్రాజెక్టుల సాకారానికి మార్గం సుగమమైందని తెలిపారు. నగరంలో రోజురోజుకూ పెరుగుతున్నవాహనాల రాకపోకలను నియంత్రించి, రహదారి భద్రతను పెంచేందుకు రూ.17.93 కోట్లతో బిఆర్ స్టేడియం, పివికె నాయుడు మార్కెట్, హిందూ కాలేజీ, కలెక్టరేట్ జంక్షన్, మెడికల్ క్లబ్, చుట్టుగుంట, మరియు నాజ్ సెంటర్ల జంక్షన్ల అభివృద్ధి, సుందరీకరణ చేపట్టనున్నామన్నారు. జంక్షన్ల వద్ద వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు కాబుల్ స్టోన్ పేవింగ్ పరిచయం చేయడంతో పాటు ల్యాండ్‌స్కేపింగ్, ఆకర్షణీయమైన లైటింగ్, నాణ్యమైన సైన్‌బోర్డులు మరియు పాదచారులకు అనుకూలమైన మౌలిక వసతులను కల్పించి నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

నగర ప్రజలకు వినూత్న రీతిలో వినోదాన్ని పంచేందుకు రూ.7.30 కోట్ల వ్యయంతో 6 విభిన్నమైన థీమ్ పార్కులను అభివృద్ధి చేయనున్నామని, వీటిలో భాగంగా లాల్ జాన్ భాష పార్కును ‘మహిళా థీమ్’తో, సీతారాం నగర్ పార్కును ‘సూపర్ హీరో థీమ్’తో, హౌసింగ్ బోర్డు కాలనీ పార్కును ‘సైన్స్ థీమ్’తో, ఉద్యోగ నగర్ పార్కును ‘కార్టూన్ పార్క్’గా, కొరిటెపాడులోని అలపాటి వెంకటరామయ్య పార్కును ‘గ్లో పార్క్’గా మరియు శాంతి నగర్ పార్కును ‘మెడిటరేనియన్ థీమ్’తో సిద్ధం చేయనున్నామన్నారు. వీటితో పాటు స్థానికులకు ప్రశాంతంగా గడిపేందుకు నగరంలోని 21 ప్రాంతాల్లోని ఓపెన్ స్పేస్ లను నైబర్‌హుడ్ పార్కులుగా రూ.7.01 కోట్లతో నవీకరించి పచ్చదనం, వాకింగ్ ట్రాక్‌లు, బెంచీలు మరియు పిల్లల ఆట స్థలాలను అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందన్నారు. నగరంలో పారిశుధ్య ప్రమాణాలు పెంచి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించేందుకు రూ.10.58 కోట్ల అంచనా వ్యయంతో 30 ప్రదేశాలలో ఆధునిక పబ్లిక్ టాయ్ లెట్స్ నిర్మాణాన్ని చేపట్టనున్నామన్నారు. ఈ టాయ్ లెట్స్ ల్లో పురుషులు, మహిళలకు ప్రత్యేక వసతులతో పాటు దివ్యాంగులకు అనుకూలమైన డిజైన్, నిరంతర నీటి సరఫరా, హ్యాండ్ వాషింగ్ సౌకర్యం, మెరుగైన వెంటిలేషన్, విద్యుత్ మరియు పక్కా మురుగునీటి నిర్వహణ వ్యవస్థలను ఏర్పాటు ఉంటుందన్నారు.
పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ నగరానికి పచ్చని మెరుగులద్దేందుకు ఫేజ్-1లో రూ.9.345 కోట్లతో 13 ప్రధాన మార్గాలలో రహదారి అవెన్యూ ప్లాంటేషన్ మరియు సెంట్రల్ డివైడర్ల వెంట అలంకార మొక్కల పెంపకంతో విస్తృతమైన సుందరీకరణ పనులు జరుగుతాయన్నారు. ఆసియాలోనే అతిపెద్ద మిర్చి మార్కెట్‌గా గుంటూరుకున్న అంతర్జాతీయ గుర్తింపును ప్రతిబింబించేలా, విజయవాడ-గుంటూరు ప్రవేశ మార్గం వద్ద రూ.1.59 కోట్లతో ‘మిర్చి థీమ్ తో పార్క్ ను రూపొందిస్తున్నామన్నారు. ప్రత్యేక ల్యాండ్‌స్కేపింగ్ మరియు సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే ఐకానిక్ ల్యాండ్‌మార్క్‌ ద్వారా ఈ ఎంట్రెన్స్ పాయింట్ నగరానికే ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ అభివృద్ధి ప్రాజెక్టుల ద్వారా గుంటూరు నగరం రాబోయే రోజుల్లో పచ్చదనం, నూతన అభివృద్ధితో కూడిన “నవ గుంటూరు”గా రూపాంతరం చెందుతుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నామన్నారు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest article

App Icon

Install Bharath Prathinidhi News App

Add to home screen for faster loading and latest updates.