రూ.50 లక్షలు ఇచ్చానని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం: మాజీ మంత్రి రావెల
గుంటూరు, 05 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : రిటైర్డ్ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్, రిటైర్డ్ డీఐజీ చావలి బాలస్వామి తనపై చేసిన ఆరోపణలు నిరాధారమని మాజీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు అన్నారు. తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. శుక్రవారం గుంటూరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బాలస్వామి ఆరోపణలను ఖండిస్తూ పలు దస్త్రాలు, ఐటీ రికార్డులను మీడియా ముందు ఉంచారు.
నమ్మించి మోసం చేశారు : 1991లో ఏసీబీ ట్రాప్ కేసులో సస్పెండ్ అయి ఇబ్బందుల్లో ఉన్న సమయంలో బాలస్వామికి తాను సహాయం చేశానని రావెల తెలిపారు. మంత్రిగా ఉన్న సమయంలో కూడా కేఈ కృష్ణమూర్తికి సిఫార్సు చేసి పోస్టింగ్ ఇప్పించానని చెప్పారు. 2015లో రాజధాని ప్రాంతంలో భూములు కొనుగోలు చేస్తామని చెప్పి సేఫ్‌వే ఇన్ఫ్రా నిధులను తీసుకుని బినామీల పేర్లతో రిజిస్ట్రేషన్లు చేయించారని ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారంపై పోలీసులను ఆశ్రయించగా బాలస్వామిపై A2గా ఎఫ్ఐఆర్ నమోదైందని తెలిపారు.

రూ.50 లక్షల ఆరోపణపై సవాల్: 2014 ఎన్నికల్లో తనకు రూ.50 లక్షలు ఇచ్చానని బాలస్వామి చేసిన ఆరోపణలను రావెల తీవ్రంగా ఖండించారు. తనకు ఒక్క రూపాయి ఇచ్చినట్లు ఆధారాలతో నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని సవాల్ చేశారు. ఆరోపణలను నిరూపించలేకపోతే బాలస్వామి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అన్నారు.
పన్నులు చెల్లించిన డబ్బుతోనే పెట్టుబడులు: రాజకీయాల్లోకి రాకముందే తాము వ్యాపారాలు నిర్వహించామని రావెల తెలిపారు. 2003లో హైదరాబాద్‌లోని ప్లెజెంట్ హైట్స్ సంస్థ ద్వారా వచ్చిన ఆదాయానికి సక్రమంగా పన్నులు చెల్లించామని, ఆ నగదుతో శాంతి కన్స్ట్రక్షన్స్, శ్రీకార పేరెంటల్స్, సేఫ్‌వే ఇన్ఫ్రా ప్రాజెక్టుల్లో నిబంధనల ప్రకారం పెట్టుబడులు పెట్టినట్లు చెప్పారు. ఇందుకు సంబంధించిన పన్ను రసీదులను మీడియాకు చూపించారు.
బాధితులతో కలిసి రాష్ట్రవ్యాప్త పోరాటం: బాలస్వామి సర్వీసు కాలంలో పలువురు దొంగ రిజిస్ట్రేషన్ల ద్వారా నష్టపోయారని రావెల ఆరోపించారు. ఉదయ్ హాస్పిటల్ స్థల వివాదం, మిషన్ భూముల బదలాయింపుల అంశాలను ఆయన ప్రస్తావించారు. బాలస్వామి బాధితుల కోసం త్వరలో టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసి, వారందరినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతామని ప్రకటించారు. తనపై చేసిన ఆరోపణలపై బాలస్వామి బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేకుంటే పరువు నష్టం దావాతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తానని రావెల హెచ్చరించారు. సమావేశంలో బాలస్వామి బాధితులుగా పేర్కొన్న పలువురు తమకు జరిగిన అన్యాయాన్ని మీడియా ముందు వివరించారు.


