పతకాల పంట పండించిన గుంటూరు క్రీడాకారులు..
జాతీయ స్థాయి పోటీలకు పలువురు ఎంపిక
గుంటూరు, 21 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : కుడో క్రీడలో గుంటూరు జిల్లా క్రీడాకారులు తమ ప్రతిభను మరోసారి చాటుకున్నారు. అనకాపల్లి జిల్లా పరవాడలో ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు జరిగిన 6వ రాష్ట్రస్థాయి కుడో పోటీల్లో గుంటూరు జిల్లా క్రీడాకారులు పలు విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి పెద్ద సంఖ్యలో పతకాలు సాధించారు. ఆంధ్రప్రదేశ్ కుడో అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ రాష్ట్రస్థాయి పోటీలను ఈ నెల 18న అనకాపల్లి జిల్లా కలెక్టర్ శ్రీ విజయ కృష్ణన్ ప్రారంభించారు. రాష్ట్రంలోని నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో క్రీడాకారులు ఈ పోటీలకు హాజరై వివిధ కేటగిరీల్లో తమ ప్రతిభను ప్రదర్శించారు. మూడు రోజుల పాటు ఉత్కంఠభరితంగా సాగిన పోటీలు 20వ తేదీన ముగిశాయి. గుంటూరు జిల్లా నుంచి పాల్గొన్న క్రీడాకారులు అద్భుతమైన ప్రదర్శనతో గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ పతకాలు సాధించి జిల్లా ఖ్యాతిని చాటారు. రాష్ట్రస్థాయి పోటీల్లో గుంటూరు క్రీడాకారుల్లో 82 శాతం మంది పతకాలు సాధించగా, 78 శాతం మంది జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం విశేషంగా నిలిచింది. ఈ సందర్భంగా క్రీడాకారులను కుడో రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఆలూరి శశిధర్, అనకాపల్లి డీఎస్‌డీవో శ్రీమతి పూజారి శైలజ, కుడో రాష్ట్ర కార్యదర్శి శ్రీ రవికుమార్, కోశాధికారి శ్రీమతి అనురాధ, అనకాపల్లి కుడో అబ్జర్వర్ శ్రీ రమణ, గుంటూరు జిల్లా కుడో అసోసియేషన్ కార్యదర్శి శ్రీ ఆర్. సిద్ధార్థ అభినందించారు. క్రీడాకారులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ.. విద్యార్థులు, యువ క్రీడాకారులు క్రీడల్లో ఉన్న అవకాశాలను గుర్తించి వాటిని అందిపుచ్చుకోవాలని సూచించారు. క్రీడల ద్వారా రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి భవిష్యత్తును నిర్మించుకునే అవకాశాలు ఉన్నాయని, నిరంతర సాధనతో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
గుంటూరు క్రీడాకారుల పతకాల వివరాలు
గోల్డ్ మెడలిస్టులు:
1. రిషి రాజ వర్మ
2. ఆర్. ఎలెన్ నెపోలియన్
3. గీతిక వెంకటలక్ష్మి
4. నాగ వరుణ్ కుశాల్
5. పి. మౌనిక
6. గీతిక
7. డి. జైరామ్ జస్వంత్
8. జి. యోగేష్
9. ఎస్. బాంధవ్
10. ఆర్. అనిల్
సిల్వర్ మెడలిస్టులు:
1. ఎ. లోకనాథ్
2. ఎం. దిలీప్ కుమార్
3. టి. ఉద్దీప్ త్రివేది
4. ఎన్. సుహాస్ డానియల్
బ్రాంజ్ మెడలిస్టులు :
1. ఎస్.కె. హసేన్ వలి
2. జె. సుమంత్
గుంటూరు జిల్లా నుంచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులు ఇకపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించనున్నారు. వీరు నవంబర్ 12 నుంచి 18వ తేదీ వరకు అహ్మదాబాద్ లోని వీర్ సావర్కర్ స్టేడియంలో జరగనున్న 18వ అక్షయ్ కుమార్ ఇంటర్నేషనల్ & నేషనల్ కుడో టోర్నమెంట్‌లో పాల్గొననున్నారు. గుంటూరు జిల్లా కుడో క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో చూపిన ప్రతిభపై కుడో అసోసియేషన్ ఆఫ్ గుంటూరు జిల్లా కార్యదర్శి శ్రీ ఆర్. సిద్ధార్థ హర్షం వ్యక్తం చేశారు. క్రీడాకారులు ఇదే స్ఫూర్తితో జాతీయ స్థాయిలో కూడా రాణించి గుంటూరు జిల్లాతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.


