గుంటూరు, 07 అక్టోబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : వన్యప్రాణుల సంరక్షణతో పాటు వాటి సహజ ఆవాసాలను పరిరక్షించి, విభజించబడిన అడవులు మరియు సహజ ప్రాంతాలను అనుసంధానం చేయడం ద్వారా వన్యప్రాణులకు సురక్షిత సంచార మార్గాలు కల్పించాలని ముఖ్య అతిథి వయోజన విద్య శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ కె. ఆంజనేయులు పిలుపునిచ్చారు. “ఆవాసాలను అనుసంధానిద్దాం – వన్యప్రాణులు వృద్ధి చెందేలా చేద్దాం” అనే సందేశంతో జాతీయ వన్యప్రాణి వారోత్సవం–2026 సందర్భంగా ప్రజల్లో, ముఖ్యంగా విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
జాతీయ వన్యప్రాణి వారోత్సవం–2026లో భాగంగా ఆంధ్రప్రదేశ్ పర్యావరణ విద్యా పరిషత్, గుంటూరు ఆధ్వర్యంలో వయోజన విద్య శాఖ కార్యాలయంలో పోస్టర్ విడుదల కార్యక్రమం బుధవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా పర్యావరణ విద్యా కోఆర్డినేటర్ డి. తిరుపతి రెడ్డి మాట్లాడుతూ, అక్టోబర్ 2 నుంచి 8 వరకు నిర్వహిస్తున్న వన్యప్రాణి వారోత్సవం ద్వారా వన్యప్రాణుల సంరక్షణ, జీవ వైవిధ్యం, సహజ ఆవాసాల పరిరక్షణ మరియు ప్రజల భాగస్వామ్యంపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. అడవులు, గడ్డి భూములు, తడిబయళ్లు, నదులు వంటి సహజ ఆవాసాలను కాపాడటంతో పాటు మనిషి–వన్యప్రాణుల సహజీవనాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.
సూపర్వైజర్ వెంకట స్వామి మాట్లాడుతూ, వన్యప్రాణులు సురక్షితంగా సంచరించేందుకు (వన్యప్రాణి మార్గాలు) ఎంతో కీలకమని తెలిపారు. ఆవాసాల మధ్య సహజ అనుసంధానం కోల్పోతే వన్యప్రాణుల కదలికలు దెబ్బతిని, మనిషి–వన్యప్రాణి ఘర్షణలు పెరిగే అవకాశం ఉందన్నారు.
మరో సూపర్వైజర్ ప్రసాద్ మాట్లాడుతూ, విద్యార్థులు మరియు యువతను వన్యప్రాణి సంరక్షణ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణ పట్ల బాధ్యతాయుతమైన దృక్పథాన్ని పెంపొందించవచ్చన్నారు. ప్రకృతి సంపదను భవిష్యత్ తరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పర్యావరణ విద్యా పరిషత్ సభ్యులు జె. స్వామినాధన్, పి. చంద్రశేఖర్, పి. దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ, వన్యప్రాణులు మరియు వాటి ఆవాసాలను రక్షించడం ద్వారా మాత్రమే జీవ వైవిధ్యాన్ని కాపాడగలమని తెలిపారు. అడవుల నరికివేత, సహజ ఆవాసాల నాశనం, కాలుష్యం వంటి సమస్యలను నియంత్రించేందుకు సమాజంలోని ప్రతి వర్గం చొరవ చూపాలని వారు కోరారు.
వన్యప్రాణులు ప్రకృతి సమతుల్యతలో కీలక పాత్ర పోషిస్తాయని, అడవులు మరియు స్థానిక సహజ ఆవాసాలను కాపాడటం ద్వారా పర్యావరణ పరిరక్షణను బలోపేతం చేయవచ్చని కార్యక్రమంలో పాల్గొన్న వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పర్యావరణ విద్యా పరిషత్ సభ్యులు, సిబ్బంది మరియు ఇతరులు పాల్గొన్నారు.
జాతీయ వన్యప్రాణి వారోత్సవం – 2026 పోస్టర్ విడుదల


