మహిళా సాధికారత, యువతకు ప్రాధాన్యత కల్పించడమే లక్ష్యం
: కూటమి జడ్పీటీసీ అభ్యర్థి గొరిగిపూడి సాత్విక
గుంటూరు, 23 అక్టోబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మహిళలకు, యువతకు పెద్దపీట వేస్తోందని, వారి ఆశీస్సులతోనే తాను జడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసినట్లు గొరిగిపూడి సాత్విక తెలిపారు. స్థానిక మండల ప్రజాపరిషత్ పరిధిలో, వట్టిచెరుకూరు మండలం ముట్లూరు గ్రామానికి చెందిన సాత్విక గురువారం కూటమి తరఫున నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, స్థానిక ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ఆశీస్సులతో ఈ అవకాశం దక్కిందని వెల్లడించారు. తమ కుటుంబం, తాతయ్య, తండ్రి మొదటినుంచీ తెలుగుదేశం పార్టీ కోసం ఎంతో అంకితభావంతో పనిచేశారని గుర్తుచేశారు. వారి అడుగుజాడల్లో నడుస్తూ ప్రజాసేవ చేయడానికే తాను రాజకీయాల్లోకి వచ్చానని వివరించారు.
యువతకు అండగా ఉంటా:
యువత రాజకీయాల్లోకి వచ్చి ముందుండాలన్న నారా లోకేష్ ఆలోచనలు తనకు స్ఫూర్తినిచ్చాయని చెప్పారు. ఎన్నికల్లో ప్రజలు తనను ఆదరించి గెలిపిస్తే మండల ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటానని, గ్రామీణ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ముఖ్యంగా నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ప్రత్యేక చొరవ చూపుతానని పేర్కొన్నారు. మండల ప్రజలు తనను నిండు మనస్సుతో ఆశీర్వదించాలని కోరారు.


