బుచ్చిరెడ్డిపాళెం 28 వార్డుల్లో మనమే గెలవాలి
మంత్రి నారా లోకేష్ పర్యటన విజయవంతం చేసిన కేడర్‌కు అభినందనలు
ప్రతి కార్యకర్తా ధైర్యంగా ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అడగాలి
అభ్యర్థి ఎవరైనా విభేదాలు పక్కనబెట్టి కూటమి విజయమే లక్ష్యంగా ఒక్కటై పనిచేయాలి
పార్టీ నాయకులు, కార్యకర్తల సమన్వయ సమావేశంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

నెల్లూరు జిల్లా, 23 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : నెల్లూరులోని వీపీఆర్ కార్యాలయంలో కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో విస్తృత స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఇటీవల కోవూరులో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పర్యటన అత్యంత విజయవంతం కావడంపై కేడర్‌ను అభినందించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమీక్షలో పర్యటనలో దొర్లిన చిన్న చిన్న లోపాలను సరిదిద్దుకుంటూ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి దిశా నిర్దేశం చేశారు. ‘మైటీడీపీ యాప్’ ద్వారానే నాయకులు, కార్యకర్తల పనితీరు అంచనా: ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ పార్టీలో ప్రతి ఒక్కరి పనితీరును పారదర్శకంగా అంచనా వేసేందుకు అధిష్టానం ‘మైటీడీపీ’ యాప్‌ను ఉపయోగిస్తోందని తెలిపారు. పార్టీ నిర్వహించే ప్రతి కార్యక్రమాన్ని, కేడర్ భాగస్వామ్యాన్ని తప్పనిసరిగా యాప్‌లో నమోదు చేయాలని స్పష్టం చేశారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నందున, నాయకులందరూ ‘మైటీడీపీ’ యాప్ వినియోగంపై పూర్తి అవగాహన పెంచుకోవాలని, అవసరమైతే తెలిసిన నాయకుల వద్ద శిక్షణ తీసుకోవాలని సూచించారు. నియోజకవర్గంలో ఏ ప్రాంతంలో స్థానిక ఎన్నికలు మొదలైనా, అది తమ సొంత బాధ్యతగానే భావించి నాయకులంతా ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
బుచ్చిరెడ్డిపాళెం ను క్లీన్‌స్వీప్ చేయడమే లక్ష్యం: మొదటగా బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని, అందరూ తమ సొంత ప్రాంతంగా భావించి కష్టపడాలని ఎమ్మెల్యే సూచించారు. మున్సిపాలిటీలోని 28 వార్డుల్లోనూ కూటమి అభ్యర్థులే గెలిచేలా కృషి చేయాలన్నారు. తాము అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజలకు మంచి చేయడం తప్ప ఎలాంటి తప్పులు చేయలేదని, ఈ విషయాన్ని ప్రజలు కూడా గమనిస్తున్నారని తెలిపారు. ప్రతిపక్ష నాయకులు ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ రోజురోజుకూ దిగజారిపోతున్నారని విమర్శించారు. గత వైసీపీ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి కంటే దోచుకున్న కమీషన్లే ఎక్కువని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక బుచ్చిరెడ్డిపాళెంలో మున్సిపల్ కార్యాలయం నిర్మించామని, సెకండ్ గ్రేడ్ మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేశామని గుర్తుచేశారు. మంగళవారమే హ్యామ్ పథకం కింద రూ.22 కోట్ల నిధులు మంజూరయ్యాయని, అతి త్వరలోనే పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. అలాగే మున్సిపాలిటీ పరిధిలోని జాతీయ రహదారి–67పై రూ.14 కోట్ల వ్యయంతో మౌలిక వసతుల అభివృద్ధి పనులు చేపట్టబోతున్నామని తెలిపారు. బుచ్చిరెడ్డిపాళెం-చెన్నూరు రోడ్డు మధ్య మల్దేవి కెనాల్‌పై వంతెన పనులు వేగంగా జరుగుతున్నాయని, నూతనంగా అగ్నిమాపక కేంద్రం నిర్మాణం కూడా శరవేగంగా సాగుతోందని వివరించారు.
వైసీపీ దోపిడీ వర్సెస్ కూటమి అభివృద్ధి: కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారని, ధైర్యంగా ప్రతి ఇంటికీ వెళ్లి ఓట్లు అడగవచ్చని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో కనిగిరి రిజర్వాయరు లీకేజ్, సేపేజ్ అయ్యేలా గ్రావెల్ దోచేశారని మండిపడ్డారు. వైసీపీ హయాంలో నిర్మించిన ఇళ్లు నిరుపయోగంగా మారాయని, వాటిని త్వరలోనే పరిశీలించి అర్హులైన నిరుపేదలకు అందజేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు, సీనియర్ నాయకుల సూచనల మేరకే అభ్యర్థులను ఎంపిక చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. అందరికీ ఒకేసారి అవకాశాలు ఇవ్వడం సాధ్యం కాదని అందరికీ తెలుసని, పోటీలో ఎవరు నిలబడ్డా పార్టీ గెలుపే ధ్యేయంగా అందరూ ఒక్కటై పనిచేసి కూటమి అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు.


