గుంటూరు, 28 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు నగరంలో ప్రముఖ వ్యాపార కేంద్రంగా ఉన్న పట్నం బజారు ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తామని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే, అసెంబ్లీ మైనారిటీస్ కమిటీ చైర్మన్ నసీర్ అన్నారు. శుక్రవారం నియోజకవర్గంలోని వడ్డెర గూడెంలో రూ.60 లక్షలు, బండ్ల నగర్ లో రూ.28 లక్షలు, బాలాజీ నగర్ లో రూ.48 లక్షలు, జియావుద్దీన్ కాలనీలో రూ.45 లక్షలతో సీసీ రోడ్లు, డ్రెయిన్లు, మంచినీటి పైపులైన్ల నిర్మాణానికి శుక్రవారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నసీర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవానికి సీఎం చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్ నాంది పలికారన్నారు. ఇప్పటికే రాష్ట్రానికి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చారన్నారు. గూగుల్, క్వాంటం వ్యాలీ వంటి ప్రముఖ సంస్థలు ఆంధ్రప్రదేశ్ కు క్యూ కట్టేలా చేశారని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రం నుంచి ప్రముఖ కంపెనీలను తరిమికొట్టారని విమర్శించారు. పారిశ్రామికవేత్తలు ఏపీ వైపు కన్నెత్తి చూడాలంటే భయపడ్డారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రాన్ని పరిశ్రమలకు స్వర్గధామంగా మార్చారని చెప్పారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూనే వ్యాపార రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను బలపరచడం ద్వారా నియోజకవర్గంలో మరింత అభివృద్ధి సాధించుకోవచ్చన్నారు. ఒకే దేశం, ఒకే నాయకత్వం ద్వారా గొప్ప ప్రగతి సాధ్యపడుతుందని దేశంలో ప్రధాని మోదీ నాయకత్వం, రాష్ట్రంలో చంద్రబాబు సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ కు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చల్లా ఆంజనేయ ప్రసాద్, చిన్న బుజ్జి, తాడిబోయిన చిరంజీవి, మీరా, రఫీ, ఖాసిమా, చైతన్య, సూరె శ్రీను, మల్లెంపూడి శ్రీను, సూరం లక్ష్మి, షాజహాన్, నయీముద్దీన్, బ్రహ్మసాని శ్రీను, గోపి, దొడ్డి నాగరాజు, యార్ల గురవయ్య, శ్రీలక్ష్మి, జగన్ తదితరులు పాల్గొన్నారు.


