12వ రోజు కొనసాగుతున్న ఏపీ జూడాల సమ్మె

గుంటూరు, 21 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఏపీ జూడా ఆధ్వర్యంలో కొనసాగుతున్న రాష్ట్రవ్యాప్త సమ్మె 12వ రోజుకు చేరుకుంది. ఫేజ్–3లో భాగంగా 5వ రోజు ఆందోళనలో గుంటూరు మెడికల్ కాలేజీకి చెందిన రెసిడెంట్ వైద్యులు, ఇంటర్న్‌లు జీజీహెచ్ సూపరింటెండెంట్ కార్యాలయం సమీపంలో శాంతియుత నిరసన చేపట్టారు. తమ న్యాయబద్ధమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ నినాదాలు చేశారు. సమస్యలపై ప్రభుత్వం అర్థవంతమైన చర్చలు జరిపి త్వరితగతిన పరిష్కారం చూపాలని కోరారు. విజయవాడలో ఏపీ జూడా ప్రతినిధులు విలేకరుల సమావేశం నిర్వహించి సమ్మెకు సంబంధించిన అంశాలను వెల్లడించారు.
సాయంత్రం 6.30 గంటల సమయంలో రెసిడెంట్లు, ఇంటర్న్‌లు ఫ్లాష్‌లైట్లతో ఫార్మేషన్ ఏర్పాటు చేశారు.

అనంతరం జీజీహెచ్ ప్రాంగణంలో ఫ్లాష్‌లైట్ ర్యాలీ నిర్వహించారు. ఓపీ గేట్ నుంచి ఎమర్జెన్సీ గేట్ వరకు, అక్కడి నుంచి తిరిగి ఓపీ గేట్ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ కార్యక్రమాలను శాంతియుతంగా, క్రమశిక్షణతో నిర్వహించినట్లు ఏపీ జూడా తెలిపింది. తమ డిమాండ్ల పరిష్కారం కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన కొనసాగిస్తూనే, ప్రభుత్వంతో అర్థవంతమైన చర్చలకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది.


