ఎమ్మెల్యే గళ్ళా మాధవి
33/11 కేవీ సబ్‌స్టేషన్‌కు శంకుస్థాపన
గుంటూరు, 28 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 23వ డివిజన్ జిల్లా పరిషత్ ఆవరణలో రూ.6.50 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 33/11 కేవీ ఇండోర్ పవర్ సబ్‌స్టేషన్‌కు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి శంకుస్థాపన చేశారు. దీనివలన 12 వేల గృహాల విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుందని తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గుంటూరు నగరంలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ ఆధునిక ఇండోర్ సబ్‌స్టేషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దాదాపు రూ.6.50 కోట్ల వ్యయంతో నిర్మితమవుతున్న ఈ సబ్‌స్టేషన్ ద్వారా సుమారు 12 వేల కుటుంబాలకు నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించే అవకాశం కలుగుతుందని చెప్పారు.
ఈ సబ్‌స్టేషన్ ఒక ప్రధాన ఫీడర్‌గా పనిచేస్తూ పరిసర ప్రాంతాలకు విద్యుత్ పంపిణీని మరింత సమర్థవంతంగా నిర్వహిస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ముఖ్యంగా బ్రాడీపేట, శాంతినగర్, కలెక్టర్ బంగ్లా ప్రాంతం, ఆకులవారి తోట, శ్రీనివాసరావుపేటతో పాటు ఏటీ అగ్రహారం నాలుగో లైన్ నుంచి పదో లైన్ వరకు ఉన్న ప్రాంతాల ప్రజలకు తరచూ ఎదురవుతున్న విద్యుత్ అంతరాయాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు. వర్షాకాలం మరియు వేసవి కాలంలో విద్యుత్ లోడ్ పెరగడం వల్ల ఏర్పడే సమస్యలను అధిగమించడంలో ఈ సబ్‌స్టేషన్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఇప్పటికే అవసరమైన ప్రాంతాల్లో అదనపు ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టినప్పటికీ, ఈ కొత్త సబ్‌స్టేషన్ మాత్రం విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారంగా నిలవనుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ అందించేందుకు కట్టుబడి ఉందన్నారు. ఈ సబ్‌స్టేషన్ నిర్మాణం పూర్తయిన అనంతరం గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని అనేక ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందుబాటులోకి వస్తాయని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు.


