ఎమర్జెన్సీ అని వెళ్తే బెడ్ దొరకటం కలేనా?
నిరాశతో ఇతర ఆసుపత్రులకు వెళుతున్న రోగులు
రిపోర్టుల కోసం రోజుల తరబడి నిరీక్షించాల్సిందే
రోగుల పట్ల దురుసుగా వ్యవహరిస్తున్న సెక్యూరిటీ సిబ్బంది
జర్నలిస్టులకూ తప్పని తిప్పలు
మంగళగిరి, 07 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : మంగళగిరిలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) లో నిపుణులైన వైద్యులతో పాటు ఆధునిక సౌకర్యాలు ఉన్నప్పటికీ పలు సమస్యలు తిష్ట వేసి ఉన్నాయి. రోగులు పెరుగుతున్న స్థాయిలో వైద్యులను, సిబ్బందిని, మెడికల్ షాప్ కౌంటర్లను, క్యాంటిన్‌లో సౌకర్యాలను పెంచలేదు. నిర్వహణ చాలా లోపభూయిష్టంగా ఉంది. ఎమర్జెన్సీ సమయంలోను బెడ్లు లేవని త్రిప్పి పంపటం రోగుల ప్రాణాలు మీదకు తెస్తోంది. లోపలికి వెళ్లడానికి, ఓపీ రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి, డిపార్ట్ మెంట్‌లో రిజిస్ట్రేషన్‌కు, డాక్టర్‌ని కలవడానికి, టెస్టులకు ఫీజులు చెల్లించడానికి, టెస్ట్‌లు చేయించుకోవడానికి, మందులు కొనడానికి దాదాపు ఏడెనిమిది చోట్ల క్యూలలో నిలబడాలి. అదే స్పెషలిస్ట్‌కు చూపించవలసిన అవసరం వస్తే మరోసారి క్యూలో నిలబడాలి. ఒక్కోచోట గంటసేపు కూడా ఎదురు చూడాలి. టెస్ట్‌లకు డబ్బు చెల్లించే కౌంటర్లు ఒక చోట ఉండవు. తెలియక ఒక కౌంటర్ వద్ద క్యూలో నిలబడి, దగ్గరకు వచ్చిన తర్వాత అక్కడ కాదని చెబుతారు. అప్పుడు మరో కౌంటర్ వద్ద మళ్లీ క్యూలో నిలబడాలి. రోగులను క్రమ పద్దతిలో క్యూలో నిలపడానికి తగినంతమంది సిబ్బంది లేకపోవడంతో రోగుల మధ్య గొడవలు, తోపులాటలు సర్వసాధారణం. ఇక్కడ ఓపీ వైద్యం పూర్తి కావడానికి ఒక పూట నుంచి రోజు పడుతుంది. అందించేది కార్పోరేట్ వైద్యం అయినా, రోగుల కష్టాలు వర్ణనాతీతం. కొన్ని చోట్ల రోగులు లేక వారి బంధువులు సిబ్బంది చిత్కారాలకు గురికావలసి వస్తోంది.డాక్టర్లు అందరూ రోగుల పట్ల చాలా మర్యాదగా వ్యవహరిస్తారు. ఎంతో ఓపికతో వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతారు. అయితే, సిబ్బందిలో కొందరు మాత్రం రోగుల పట్ల చాలా దురుసుగా ప్రవర్తిస్తుంటారు. కొందరు ఎక్కువ సమయం సెల్ ఫోన్‌లో మాట్లాడుతుంటారు. రోగులను పట్టించుకోరు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే రోగులకు తగిన సమాచారం ఎవ్వరూ సరిగా ఇవ్వరు. దాంతో వాళ్లు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కొందరు సెక్యూరిటీ సిబ్బంది రోగులు, వారి బంధువుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పేరుకు మాత్రం 960 బెడ్లు ఉన్నాయని, ఆస్పత్రి వైద్యాధికారులు గొప్పగా ప్రకటిస్తున్నారు. అత్యవసర సమయాల్లో వైద్యం కోసం రోగులు వెళితే బెడ్లు ఖాళీ లేవని, తిప్పి పంపుతున్నారు. సిఫారసు ఉంటే బెడ్ సులువుగా దొరుకుతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇక చిన్న పిల్లల అత్యవసర ఐసీయూలో రాత్రి వేళల్లో సిబ్బంది ఉండటం లేదని, పలువురు వాపోతున్నారు. తక్కువ ధరకు కార్పొరేట్ వైద్యం అంటూ చేస్తున్న ప్రచారాలను నమ్మి వస్తున్న రోగులకు అనేక సందర్భాల్లో నిరాశ, తీవ్ర అసంతృప్తి ఎదురవుతున్నాయి.
మీడియా కు కష్టాలే!
సామాన్య ప్రజలకే కాదు ఎయిమ్స్ వైద్యశాల వార్తలు కవరేజ్ చేసే మీడియా వారికి సైతం ఇబ్బందులు తప్పడం లేదు. గురువారం ఓ మీడియా ఛానల్ లో పనిచేస్తున్న పెరిక రమేష్ ప్రెస్ మీట్ కు వెళ్ళాడు. తిరిగి వచ్చే క్రమంలో వాంతులు, కడుపు నొప్పితో అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. ఎయిమ్స్ లో వైద్యం కోసం ప్రయత్నించగా, అక్కడ స్పందన లేకపోవడంతో మంగళగిరిలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయించారు. ఇటువంటి కారణాల వలన వేరే ఆసుపత్రులకు వెళ్లే రోగుల సంఖ్య ప్రతి రోజు ఎక్కువగానే ఉంటుంది. లోపాలను ఎయిమ్స్ వైద్యాధికారుల దృష్టికి తీసుకు వెళ్లినప్పటికీ పట్టించుకునే పరిస్థితి ఏ మాత్రం కనిపించడం లేదు.
రిపోర్టులు కోసం రోజుల తరబడి!
బయట కేవలం గంట వ్యవధిలో వచ్చే మెడికల్ రిపోర్టులు ఎయిమ్స్ వైద్యశాలలో మాత్రం రెండు రోజుల తర్వాత వచ్చి తీసుకుని వెళ్లాలని సూచిస్తున్నారు. సీటీస్కాన్, ఆల్ట్రా స్కాన్, ఎమ్మారై స్కాన్, వినికిడి టెస్ట్… వంటి వాటికి నెల రోజులకు పైగా ఎదురు చూడవలసి వస్తోంది. అలాగే, భోజనశాల, క్యాంటిన్ నిర్వహణ కూడా చాలా అధ్వాన్నంగా ఉంది. భోజనశాలలో టేబుల్‌పై మంచి నీళ్ల జగ్గులు, గ్లాసులు ఉండవు. వాటర్ బాటిల్ కొనుక్కోమని ఉచిత సలహాలు ఇస్తుంటారు. ఈ విషయమై రోగులు ఆందోళన చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మెడికల్ షాపుల నిర్వహణ కూడా అధ్వాన్నంగా ఉంది. ఎయిమ్స్‌లో అతి తక్కువ ఖర్చుతో మంచి వైద్య సేవలు అందిస్తున్నప్పటికీ, నిర్వహణ పరంగా రోగులు, వారి బంధువులు అనేక అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా కొందరు దిగువ స్థాయి సిబ్బంది చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎయిమ్స్ వైద్యాధికారులు ఇటువంటి సమస్యలపై దృష్టి పెట్టి పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


