గుంటూరు, 13 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : అగ్రిగోల్డ్ బాధితులు సమస్యల పరిష్కారం కోరుతూ అగ్రిగోల్డ్ పరిరక్షణ సమితి సభ్యులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా గుంటూరులో ప్రదర్శన చేపట్టి, కలెక్టర్ కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాధిత సంఘం ప్రతినిధులు కొక్కెర శ్రీనివాస్, శివరామకృష్ణ తదితరులు మీడియాతో మాట్లాడుతూ గత 12 ఏళ్ళుగా అగ్రిగోల్డ్ బాధితులు అల్లాడుతున్నారు. అగ్రిగోల్డ్ యాజమాన్యం ఇచ్చిన హనుమా వెంచర్లో ఉన్న ప్లాట్లను ప్రభుత్వం సీజ్ చేసింది. స్పెషల్ కోర్టు ఏర్పాటు చేసి మా సమస్యలను తీరుస్తామన్నారు. కూటమి ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నిసార్లు సిఐడీ కోర్టు మెట్లెక్కినా బాధితులకు ఇంతవరకు న్యాయం చేయలేదు. వెయ్యి మందికి పైగా అగ్రిగోల్డ్ బాధితులు ఆత్మహత్యలు చేసుకున్నారు. పుల్ పేమెంట్ కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకున్న ప్లాట్లను ప్రభుత్వం తీసుకోవటం ఏంటి?. రిజిస్ట్రేషన్ స్థలాల్లో ఇళ్ళుకట్టుకున్న వారికి కోర్టు నుంచి నోటీసులు ఇచ్చారు. అగ్రిగోల్డ్ ఆస్థులను ఈ వేలం వేస్తామని ప్రభుత్వం చెపుతుంది. దాని వలన పూర్తిస్థాయిలో డబ్బులు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి అన్యాయం జరుగుతుంది. అగ్రిగోల్డ్ కంపెనీ రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్ లు జప్తు రిలీజ్ చేస్తామని గతంలో హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ నేటికీ జప్తు రిలీజ్ చేయలేదని, అమ్ముకునే హక్కు కల్పించడం లేదన్నారు. ఈ ఆక్షన్ పెట్టి రూపాయి ఆస్తి ని పావలా కే కొట్టేస్తున్నారని పేర్కొన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులు ఆక్రమణకు గురి కాకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పారు. పూర్తిగా డబ్బులు చెల్లించిన వారికి తప్పనిసరిగా ప్లాట్ లు రిజిస్ట్రేషన్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మరోసారి అగ్రిగోల్డ్ బాధితులు ఆందోళన బాట పట్టడం ఖాయమని హెచ్చరించారు.
అగ్రిగోల్డ్ ఆస్తులు ఆక్రమణకు గురి కాకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి


