: ఎమ్మెల్యే నసీర్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యాలరావు
గుంటూరు, 01 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ :
ఆంధ్ర రాష్ట్రానికే తలమానికంగా ఉన్న భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం పూర్తి చేస్తే కడుపులో అంత మంట ఎందుకు జగన్ అని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ ప్రశ్నించారు. ఇంటింటికీ ప్రచారంలో భాగంగా స్థానిక ఆర్టీసీ కాలనీ మన ఇంటికి-మన నసీర్ కార్యక్రమం టీడీపీ జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యాలరావుతోకలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నసీర్ మాట్లాడుతూ, వెనుకబడిన ప్రాంతమైన ఉత్తరాంధ్ర రూపురేఖలను మార్చే అత్యంత ప్రతిష్టాత్మకమైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం సిద్ధమైందన్నారు. ఉత్తరాంధ్ర ‘గేమ్ ఛేంజర్’ అని చెప్పారు. ఇంత గొప్ప ప్రాజెక్టు పూర్తి చేస్తే తమ హయాంలోనే నిర్మించామని జగన్ గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. వైసీసీ హయాంలో కేవలం 26 శాతం మాత్రమే బోగాపురం ఎయిర్ పోర్టు పనులు పూర్తి చేశారని తెలిపారు. ఆ తర్వాత గాలికి వదిలేశారని విమర్శించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పూర్తి చేసిన భోగాపురం విమానాశ్రయం కేవలం ఒక రవాణా కేంద్రం మాత్రమే కాదని, ఇది ఉత్తరాంధ్ర యువత కలలు, ఉద్యోగ అవకాశాలు, పారిశ్రామిక వికాసానికి వేదిక అని చెప్పారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఒక ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమాన్ని అందిస్తున్నామని తెలిపారు. అర్హులకు త్వరలోనే పింఛన్లు అందిస్తామని తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సూపర్ సిక్స్ అమలు చేశామని, స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని చెప్పారు. ఏ ఇంటికి వెళ్లినా ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు దాసరి రాజా మాస్టర్, అన్వర్, జబీ, పిచ్చిరెడ్డి, బాజీ, రూబెన్, వెంకటేశ్వర్లు, మహేష్, దాసు, కోటి, రాజా, ఖాదర్ బాషా తదితరులు పాల్గొన్నారు.


