గుంటూరు, 17 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గ్రామాల్లో మౌలిక వసతులను మెరుగుపరచడంతో పాటు సంక్షేమ కార్యక్రమాలను కూడా సమాంతరంగా ముందుకు తీసుకెళ్తున్నామని కేంద్ర కమ్యూనికేషన్స్, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. పెదనందిపాడు మండలంలోని పరిటాలవారిపాలెం, ఉప్పలపాడు, జరుగులవారిపాలెం, నాగభైరవునిపాలెం గ్రామాల్లో డా. పెమ్మసాని చంద్రశేఖర్ పర్యటించి, వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో గురువారం పాల్గొన్నారు. నాలుగు గ్రామాల్లో సుమారు రూ.3 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించడంతో పాటు పలు పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా డా. పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, పరిటాలవారిపాలెం గ్రామంలో సీసీ రోడ్డును ప్రారంభించి, ప్రధాన డ్రెయిన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. ఉప్పలపాడు గ్రామంలో ఆర్‌అండ్‌బీ రోడ్డును ప్రారంభించామన్నారు. జరుగులవారిపాలెం గ్రామంలో గ్రామ చెరువు, సీసీ రోడ్డు పనులను ప్రారంభించామని, నాగభైరవునిపాలెంలో రోడ్‌షోలో పాల్గొని నూతన పంచాయతీ భవనాన్ని ప్రారంభించడంతో పాటు బహిరంగ సభలో పాల్గొన్నామన్నారు. గ్రామాల్లో ప్రజలు ఎన్నో ఏళ్లుగా కోరుతున్న సీసీ రోడ్లు, డ్రైన్లు, పంచాయతీ భవనాలు, చెరువుల అభివృద్ధి వంటి మౌలిక వసతుల పనులకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. గత రెండేళ్లుగా ప్రతి రెండు మూడు వారాలకు ఒకసారి గ్రామాల్లో రూ.3 – 4 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెప్పారు. మూడు ప్రధాన గ్రామాల్లో ఒక్కో గ్రామానికి సుమారు రూ.50 లక్షల చొప్పున చెరువులను ఆధునీకరించి కమ్యూనిటీ ప్రదేశాలుగా అభివృద్ధి చేశామని తెలిపారు. పిల్లలు, పెద్దలు అందరూ వినియోగించుకునేలా ఈ ప్రాంతాలను తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. 30 – 40 ఏళ్లుగా పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న గుంటూరు ఛానల్ భూసేకరణలో దాదాపు 90 శాతం పూర్తయిందని, పనులు కూడా కొనసాగుతున్నాయని తెలిపారు. త్వరలో సుమారు రూ.100 కోట్లతో ఆయుర్వేద ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు.

గ్రామాల్లో ప్రజల నుంచి ప్రధానంగా అదనపు పెన్షన్లు, ఇళ్ల కోసం విజ్ఞప్తులు వస్తున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు తొలుత కేటాయించిన ఇళ్లకు అదనంగా మరో 2.25 లక్షల ఇళ్లు తీసుకురాగలిగామని, దీంతో రాష్ట్రానికి మొత్తం 3 లక్షల ఇళ్లు కేటాయించబడ్డాయని చెప్పారు. ప్రత్తిపాడు, గుంటూరు పార్లమెంట్ పరిధికి సాధ్యమైనంత ఎక్కువ ఇళ్లు తీసుకురావడానికి కృషి చేశామని తెలిపారు. స్థలం ఉన్న అర్హులైన లబ్ధిదారులకు రాబోయే 10 – 15 రోజుల్లో ఇళ్ల మంజూరు ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేలా చర్యలు తీసుకుంటామన్నారు. స్థలం లేని అర్హులైన పేదలకు కూడా భూమిని సేకరించి ఇళ్ల స్థలాలు అందించాలనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచన ఉందని, ఆ దిశగా కూడా త్వరలో చర్యలు ముందుకు సాగుతాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమంత్రి నాయకత్వంలో సంక్షేమం, అభివృద్ధి రెండింటికీ సమాన ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందని డా. పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్న స్థానిక ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులుకి డా. పెమ్మసాని చంద్రశేఖర్ అభినందనలు, ధన్యవాదాలు తెలియజేశారు.


