ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా కన్వీనర్ పొన్నపల్లి సత్యనారాయణ
వెల్లటూరు/భట్టిప్రోలు, 04 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : బాపట్ల జిల్లా రేపల్లె ఖండ భట్టిప్రోలు మండల పరిధిలోని వెల్లటూరు గ్రామంలో వెలసియున్న శ్రీ గీతా మందిరం ప్రాంగణంలో శ్రీకృష్ణాష్టమి పర్వదిన వేడుకలు శుక్రవారం భక్తిశ్రద్ధలు, అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ ఆధ్యాత్మిక సంబరాలలో ముఖ్య అతిథులుగా జిల్లా కన్వీనర్ పొన్నపల్లి సత్యనారాయణ, జిల్లా మహిళా కన్వీనర్ బొలగాని విజయలక్ష్మి పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ పొన్నపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ శ్రీకృష్ణ భగవానుడు మానవాళికి ప్రబోధించిన భగవద్గీత సందేశం నిత్యనూతనమని, ధర్మమార్గంలో నడుస్తూ సమాజ హితం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు.

గ్రామీణ ప్రాంతాల్లో ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ప్రజల్లో భక్తిభావంతో పాటు శాంతి, సామరస్యాలు వెల్లివిరుస్తాయని పేర్కొన్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు అతిథులకు ఘనంగా తీర్థప్రసాదాలు అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో రేపల్లె ఖండ కన్వీనర్ క్రాప రవికుమార్, స్థానిక భక్తులు,మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కృష్ణనామస్మరణతో మందిర ప్రాంగణాన్ని మార్మోగించారు.


