ఇబ్రహీంపట్నం, 24 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : అనవసర విషయాల్లో తాను జోక్యం చేసుకునే వ్యక్తిని కాదని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ స్పష్టం చేశారు. మాజీ మంత్రి జోగి రమేష్ చేసిన ఆరోపణలపై ఇబ్రహీంపట్నంలో సోమవారం ఓ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే వసంత మీడియా ఎదుట స్పందించారు. శాసనసభ్యుల కార్యాలయానికి నిత్యం ఎంతోమంది వస్తుంటారని తెలిపారు. అదేవిధంగా మేఘన, ఆమె కుటుంబ సభ్యులు కూడా తన కార్యాలయానికి వచ్చినట్లు చెప్పారు. ప్రజాప్రతినిధిగా తన కార్యాలయానికి ఎవరైనా రావచ్చని, ఎవరైనా వెళ్లవచ్చని పేర్కొన్నారు. కుటుంబ వ్యవహారం కావడంతో ఇరు వర్గాలు మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకోవాలని తాను సలహా ఇచ్చినట్లు ఎమ్మెల్యే వసంత తెలిపారు. ఈ విషయంలో తాను ఎలాంటి జోక్యం చేసుకోలేదని స్పష్టం చేశారు. తన వ్యక్తిత్వం అందరికీ తెలిసిందేనని అన్నారు. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవడం తనకు అలవాటు లేదని పేర్కొన్నారు. కుటుంబ వ్యవహారాలను రాజకీయ అంశాలతో ముడిపెట్టకుండా సంబంధిత వ్యక్తులు మాట్లాడుకుని పరిష్కరించుకోవడం మంచిదని సూచించారు.


