గుంటూరు, 20 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు, గృహ నిర్మాణ సమస్యలను ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రస్తావించి, జర్నలిస్టుల పక్షాన గళమెత్తిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి కి స్టేట్ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ (SSAMNA) గుంటూరు జిల్లా కమిటీ తరఫున అధ్యక్ష కార్యదర్శి రోళ్ళ రఘునాథ్ రెడ్డి, సిహెచ్. శ్రీనివాస్ రావు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
అమరావతి వెలగపూడిలో జరుగుతున్న శాసనసభ వర్షాకాల సమావేశాల సందర్భంగా జీరో అవర్‌లో జర్నలిస్టుల సమస్యలను ప్రస్తావిస్తూ, క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో జర్నలిస్టులు నిర్వహిస్తున్న కీలక పాత్రను ఎమ్మెల్యే గళ్ళా మాధవి గుర్తు చేయడం అభినందనీయమని సామ్నా గుంటూరు జిల్లా కమిటీ పేర్కొంది. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో పనిచేస్తున్న అనేక మంది జర్నలిస్టులు పరిమిత ఆదాయంతో కుటుంబాలను పోషిస్తూ, సొంత ఇల్లు నిర్మించుకోవడం కోసం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు లేదా గృహ నిర్మాణ సౌకర్యం కల్పించాలని అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని కోరడం జర్నలిస్టుల సంక్షేమం పట్ల ఎమ్మెల్యే గళ్ళా మాధవి కి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జర్నలిస్టుల కోసం ఏర్పాటు చేసిన హౌసింగ్ కాలనీలను ప్రస్తావిస్తూ, విభజిత ఆంధ్రప్రదేశ్‌లో జర్నలిస్టులకు గృహ సౌకర్యం కల్పించేందుకు గతంలో జారీ చేసిన జి.ఓ. నెం. 67, 107లను అమలు చేయాలని ఎమ్మెల్యే కోరడం హర్షణీయం అని సామ్నా పేర్కొంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అర్హత కలిగిన, ముఖ్యంగా అక్రిడిటేషన్ పొందిన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు లేదా గృహ నిర్మాణ సౌకర్యం కల్పించే దిశగా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని సామ్నా గుంటూరు జిల్లా కమిటీ కోరింది.
గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి కి సామ్నా కృతజ్ఞతలు


