చరిత్రలో బీసీలు మరిచిపోలేని రోజు
టీడీపీ రాష్ట్ర బీసీ నాయకుడు చేజర్ల సతీష్
బాపట్ల, 18 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చరిత్రలో బీసీలు మరిచిపోలేని రోజుగా నిలిచిపోతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ నాయకుడు చేజర్ల సతీష్ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బీసీలకు 34 శాతం, పట్టణ ప్రాంతాల్లో 33⅓ శాతం రిజర్వేషన్లు అమలు కానుండటంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు బీసీలకు ఇచ్చిన హామీల్లో మరో ముఖ్యమైన హామీని నెరవేర్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మకు చేజర్ల సతీష్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గత ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లకు కోత విధించడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా 16 వేలకు పైగా రాజకీయ పదవులకు బీసీలు దూరమయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో బీసీలకు రాజకీయంగా మరింత ప్రాతినిధ్యం లభించే అవకాశం ఏర్పడిందన్నారు. వర్షాకాల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంగళవారం శాసనసభలో స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుపై చర్చ జరగడం శుభపరిణామమని పేర్కొన్నారు. బీసీల సంక్షేమం, రాజకీయ ప్రాతినిధ్యం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కట్టుబడి పనిచేస్తున్నారని, ఆయన బీసీల పక్షపాతి అని మరోసారి రుజువైందని చేజర్ల సతీష్ అన్నారు. బీసీలకు న్యాయం జరిగేలా కీలక నిర్ణయం తీసుకున్న కూటమి ప్రభుత్వానికి బీసీ వర్గాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ఆయన తెలిపారు.


