నగర కమిషనర్ కె.మయూర్ అశోక్
గుంటూరు, 05 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : పర్యావరణాన్ని పరిరక్షిస్తూ, కాలుష్య రహితంగా వినాయక చవితి పండుగను జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ నెల 11వ తేదీన నగరంలో సుమారు 25 వేల మంది విద్యార్థులతో మట్టి వినాయక ప్రతిమల తయారీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. శనివారం నగరపాలక సంస్థ కాన్ఫరెన్స్ హాల్లో వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యాశాఖ, జిఎంసి అధికారులతో “ఎకో ఫ్రెండ్లీ వినాయక చవితి” వేడుకల నిర్వహణపై ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, పూర్వకాలంలో పండుగలను పర్యావరణానికి, ప్రజారోగ్యానికి మేలు చేసే రీతిలో జరుపుకునేవారమన్నారు. కానీ ప్రస్తుతం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ప్రమాదకరమైన రసాయన రంగులతో తయారుచేసిన విగ్రహాలను ఉపయోగించడం వల్ల పర్యావరణ కాలుష్యంతో పాటు ప్రజలు అనేక అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావడానికి జిఎంసి తరఫున మొదటి అడుగుగా విద్యార్థుల ద్వారా మట్టి వినాయక ప్రతిమలను తయారు చేయించి, వారిలో పర్యావరణం పట్ల ఆసక్తి పెంపొందేలా కృషి చేయాలని నిర్ణయించామన్నారు. ఇందులో భాగంగా నగరంలోని ప్రతి విద్యాసంస్థకు వివిధ రకాల మొక్కల విత్తనాలు కలిపిన నాణ్యమైన మట్టిని అందజేసి, విద్యార్థులు వినాయక ప్రతిమలు చేసేలా ప్రోత్సహిస్తామని వెల్లడించారు. ఒకేసారి సుమారు 25 వేలకు పైగా ఇళ్లల్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ విగ్రహాల స్థానంలో మట్టి విగ్రహాలను చేర్చవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి విద్యార్థికీ ప్రత్యేక పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఇస్తామని తెలిపారు. అంతేకాకుండా, పాఠశాలల వారీగా కొంతమంది విద్యార్థులను ‘గ్రీన్ అంబాసిడర్లు’గా నియమించి, వారికి జిఎంసి నుండి ప్రత్యేకమైన బ్యాడ్జీలను అందజేస్తామని చెప్పారు. పర్యావరణ పరిరక్షణ కోసం చేపడుతున్న ఈ విశిష్టమైన కార్యక్రమానికి విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థలు మరియు నగర ప్రజలందరూ పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్లు బి.శ్రీనివాసరావు, సిహెచ్.శ్రీనివాస్, సిఎంఓహెచ్ డాక్టర్ శాంతికళ, ఎంహెచ్ఓ డాక్టర్ సురేష్ బాబు, ఎస్ఈ సుందర్రామిరెడ్డి, ఎంఈఓలు, వివిధ స్వచ్చంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.


