గుంటూరు, 16 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ప్రజలకు తాగునీరు అందించడంతో అధికారులు ఎలాంటి అలసత్వం వహించినా సహించం. ఎన్నో రోజులుగా చంద్రబాబు నాయుడు కాలనీ వాసులు మంచినీరు లేక గొంతెండుతుంటే ఏం చేస్తున్నారు ? ప్రజలకు మంచినీళ్లు లేకపోతే ఎంత ఇబ్బందులు పడతారో తెలియదా ? ప్రజలకు అత్యవరసమైన విషయాల్లో అశ్రద్ధ చేస్తే మాత్రం ఊరుకునే ప్రస్తక్తి లేదు అని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం స్థానిక చంద్రబాబు నాయుడు కాలనీలో మంచినీళ్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే నసీర్ కు సమాచారం రావడంతో మంగళవారం ఉదయం వెనువెంటనే ఆ ప్రాంతానికి వెళ్లారు. స్థానిక ప్రజలతో మాట్లాడి ఏ సమయంలో మంచినీళ్లు వస్తున్నాయి ? ఎంత సేపు వస్తున్నాయి ? అసలు ఎన్నిరోజుల నుంచి నిలిచిపోయాయి ? వంటి అంశాలపై ఆరా తీశారు. మంచినీటి అవసరాలకు ప్రత్యామ్నాయంగా ఎలాంటి చర్యలు తీసుకున్నారని అడిగి తెలుసుకున్నారు. అనంతరం చంద్రబాబు నాయుడు కాలనీలో మంచినీటి సమస్య పరిష్కారానికి యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. మంచినీటి సరఫరాలో ఎక్కడ లోపం ఉందో గుర్తించాలన్నారు. పైపులైన్లను సక్రమంగా పరిశీలించి, ఇబ్బందులు రాకుండా చూడాలని ఆదేశించారు. చంద్రబాబు నాయుడు కాలనీలో పైపులైన్ల ఏర్పాటు అవసరమైన స్థలాన్ని పరిశీలించి సేకరించాలని సూచించారు. నియోజకవర్గంలో ఎక్కడా మంచినీటి సమస్య తలెత్తినా సహించబోమని హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు కాలనీలో రోడ్ల పరిస్థితిపై ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని, రోడ్ల నిర్మాణం చేపడతామని తెలిపారు. రాష్ట్రంలో ఎల్ నిలో ప్రభావం కారణంగా వర్షాలు లేకపోయినప్పటికీ ఎక్కడా మంచినీటి సమస్య రాకుండా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గృహాలకు సరఫరా అయ్యే నీటిని నాలుగు పద్ధతుల్లో క్లోరినేషన్ చేస్తున్నామని తెలిపారు. ప్రజలకు మంచినీటి సమస్య ఎక్కడ తలెత్తినా వెంటనే తమ కార్యాలయాన్నిగానీ, తనను స్వయంగాగానీ సంప్రదించాలని సూచించారు.


