గుంటూరు, 03 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగం జరుగుతున్నాయి. గురువారం నియోజకవర్గ పరిధిలోని 18, 19, 20, 22, 25వ డివిజన్లలో సుమారు రూ.13 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గళ్ళా మాధవి శంకుస్థాపన చేశారు. రోడ్లు, డ్రెయిన్లు, కల్వర్టులు, తాగునీటి సౌకర్యాలు, సచివాలయ భవన నిర్మాణం వంటి ప్రజలకు నిత్యావసరమైన మౌలిక వసతుల కల్పనకు ఈ పనులు దోహదపడనున్నాయి. 18వ డివిజన్‌లో రూ.1.13 కోట్ల వ్యయంతో పల్నాడు బస్టాండ్ నుంచి పట్నం బజార్ మెయిన్ రోడ్ వరకు సీసీ డ్రెయిన్ నిర్మాణం, శ్రీనివాసరావుతోటలో కొత్త సచివాలయ భవనం నిర్మాణం, కంపౌండ్ వాల్, పాత భవనాల మరమ్మతులు, వడ్డెగూడెం ప్రాంతంలో సీసీ రోడ్లు, డ్రెయిన్లు, పైప్‌లైన్ పనులకు శ్రీకారం చుట్టారు.
19వ డివిజన్ లో రూ.2.51 కోట్లతో నల్లచెరువు ప్రాంతంలోని పలు లైన్లలో సీసీ రోడ్లు, సీసీ డ్రెయిన్ల నిర్మాణ పనులను ప్రారంభించారు.
20వ డివిజన్ లో రూ.3.93 కోట్లతో సంపత్‌నగర్, నల్లచెరువు, కొబ్బరితోట ప్రాంతాల్లో సీసీ డ్రెయిన్లు, ఆర్‌సీసీ కల్వర్టులు, వెట్‌మిక్స్ రోడ్లు, అంతర్గత రహదారుల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
22వ డివిజన్‌లో రూ.2.55 కోట్లతో నైజాం బజార్, ఏటీఎం బజార్, 60 అడుగుల రోడ్డులో సీసీ డ్రెయిన్లు, ఆర్‌సీసీ కల్వర్టులు, సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపట్టనున్నారు.
25వ డివిజన్ లో రూ.2.83 కోట్లతో నరసరావుపేట రోడ్డులో డ్రెయిన్ నిర్మాణం, గెలాక్సీ బార్ రోడ్డులో డ్రెయినేజ్ పనులు, విశాలాక్షి కోల్డ్ స్టోరేజ్ వరకు సీసీ రోడ్డు, మురికిపేట ప్రాంతాల్లో రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ, గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి పరంగా ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లుగా భావించి ముందుకు సాగుతున్నామని తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి వాటికి శాశ్వత పరిష్కారాలు చూపించే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో రూ.350 నుంచి రూ.400 కోట్ల విలువైన అభివృద్ధి పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు. రోడ్లు, డ్రెయిన్లు, తాగునీటి పైప్‌లైన్లు, స్ట్రీట్‌లైట్లు, పారిశుద్ధ్య సదుపాయాల కల్పనలో గణనీయమైన మార్పు తీసుకువచ్చామన్నారు. గతంలో సమస్యలతో ఇబ్బంది పడిన ప్రాంతాల్లో ఇప్పుడు మౌలిక సదుపాయాలు మెరుగుపడుతున్నాయని తెలిపారు. పల్నాడు బస్టాండ్ నుంచి పట్నంబజార్ వరకు, నల్లచెరువు, సంపత్‌నగర్, కొబ్బరితోట, శ్రీనివాసరావుతోట, మురికిపేట తదితర ప్రాంతాల్లో ఎన్నాళ్లుగానో ప్రజలు ఎదురుచూస్తున్న పనులు ఇప్పుడు కార్యరూపం దాలుస్తున్నాయని చెప్పారు. కొబ్బరితోట ప్రాంత ప్రజలు రోడ్లు, డ్రెయిన్ల కోసం పలుమార్లు వినతులు అందించారని, ఆ సమస్యలకు ఇప్పుడు పరిష్కారం లభించబోతోందన్నారు. ప్రజలకు అవసరమైన మంచినీటి సరఫరా, డ్రెయినేజ్ వ్యవస్థ, పారిశుద్ధ్యం, స్ట్రీట్‌లైటింగ్ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని పేర్కొన్నారు. ఎక్కడైనా సమస్యలు ఉన్నట్లు తమ దృష్టికి వస్తే వెంటనే స్పందించి పరిష్కరించేలా అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. ఈ రోజు శంకుస్థాపన చేసిన పనులన్నింటినీ వచ్చే రెండు నుంచి మూడు నెలల్లో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. అభివృద్ధి పనుల అమలులో జాప్యం జరిగిన కొన్ని సందర్భాల్లో కాంట్రాక్టర్ల సమస్యలు, పెండింగ్ బిల్లులు వంటి కారణాలు ఉన్నప్పటికీ ఇప్పుడు వాటిని అధిగమించి పనులు వేగవంతం చేస్తున్నామన్నారు.

ఎన్నికలు వస్తున్నాయనే ఉద్దేశంతో పనులు చేపట్టడం లేదని, ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో కూడా పెండింగ్‌లో ఉన్న అన్ని పనులకు అంచనాలు సిద్ధం చేసి టెండర్లు పిలిచి పూర్తి చేస్తామన్నారు. అక్టోబర్ నెల నుంచి కొత్త వృద్ధాప్య, వితంతు పెన్షన్ల పంపిణీ ప్రారంభం కానుందని, ఇప్పటికే ‘తల్లికి వందనం’, ఇళ్ల పట్టాల పంపిణీ వంటి సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రజల అవసరాలను ముందుగానే గుర్తించి వారి ఇంటి వద్దకే అభివృద్ధి, సంక్షేమ ఫలాలు చేర్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. 2029 ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి ఎన్నికల బరిలోకి వెళ్తామని గళ్ళా మాధవి ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాల్లో ఉల్లి గోపాల్ కృష్ణ,రాళ్ళ బండి రామరాజు, గాలం వెంకటేశ్వర్లు, షేక్ ఇమ్రాన్, చింతకాయల వెంకట సాయి, కూటమి నాయకులు, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.


