కేసును ఛేదించిన నగరపాలెం పోలీసులు
11 మంది అరెస్ట్.. మరో ముగ్గురి కోసం ముమ్మర గాలింపు..
గుంటూరు, 31 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : రెండు దశాబ్దాల క్రితం నాటి వివాహేతర సంబంధ వివాదం, పాత కక్షల నేపథ్యంలో నగరంలో జరిగిన వ్యక్తి దారుణ హత్య కేసును నగరపాలెం పోలీసులు ఛేదించారు. ఈ హత్యతో సంబంధం ఉన్న 11 మంది నిందితులను అరెస్టు చేసినట్లు ఇన్‌ఛార్జి డీఎస్పీ టి. సీతారాం వెల్లడించారు. నగరపాలెం పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు.
2006 నాటి హత్యకు.. పోలీసుల కథనం ప్రకారం.. మృతుడు పెండ్రాల చిన్న 20 ఏళ్ల క్రితం గుంటూరు కొండ వెంకటప్పయ్య కాలనీలో నివాసం ఉండేవాడు. ఆ సమయంలో చిన్న భార్యతో పెండ్రాల వెంకన్న అనే వ్యక్తి వివాహేతర సంబంధం కొనసాగించాడు. ఈ వివాదం ముదిరి 2006లో వెంకన్నను చిన్న హతమార్చాడు. నాటి నుంచి వెంకన్న కుటుంబ సభ్యులు, బంధువులు చిన్నపై తీవ్రమైన కక్ష పెంచుకున్నారు.
పథకం ప్రకారం దాడి.. 11 మంది అరెస్ట్
పాత కక్షలతో రగిలిపోతున్న ప్రత్యర్థులు సమయం చూసి పథకం ప్రకారం చిన్నను దారుణంగా హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టి, హత్యలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొన్న 11 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులందరిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశామని ఆయన స్పష్టం చేశారు.


