Thursday, September 10, 2026
spot_imgspot_img

అంతర్జాతీయ అంధ క్రికెటర్లకు ఒక్కొక్కరికి ₹10 లక్షల ఆరోగ్య బీమా

Must read

📰 Generate e-Paper Clip

పాలసీలను అందజేసిన ఏ‌సి‌ఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ (చిన్ని), కార్యదర్శి సానా సతీష్ బాబు

దివ్యాంగ క్రికెటర్లను సాధారణ క్రికెటర్లతో సమానంగా ప్రోత్సహిస్తాం: ఏ‌సి‌ఏ

ఇంగ్లండ్, శ్రీలంకల్లో రాణించిన డెఫ్ క్రికెటర్లకు ఘన సన్మానం

   

విజయవాడ, 05 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : భారతదేశం తరఫున అంతర్జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహిస్తూ అద్భుత ప్రతిభ కనబరుస్తున్న అంధ క్రికెటర్ల భద్రత, ఆరోగ్యం మరియు సంక్షేమం కోసం ఒక విశేషమైన కార్యక్రమం విజయవాడలోని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏ‌సి‌ఏ) కార్యాలయంలో జరిగింది. క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఆంధ్రప్రదేశ్ (CABAP – CABI అనుబంధ సంస్థ), డిఫరెంట్లీ ఏబుల్డ్ క్రికెట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (DCCAP) సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఐదుగురు అంధ క్రికెటర్లకు ఒక్కొక్కరికి ₹10 లక్షల ఆరోగ్య బీమా కవరేజ్ కలిగిన పాలసీలను అందజేశారు. ఈ బీమా పాలసీలను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ (చిన్ని), ప్రధాన కార్యదర్శి సానా సతీష్ బాబు క్రీడాకారులకు స్వయంగా అందజేశారు.

దివ్యాంగ క్రికెటర్లకు సమాన ప్రోత్సాహం : కేశినేని శివనాథ్ (చిన్ని)
దివ్యాంగ క్రీడాకారులు తమ ప్రతిభతో దేశానికి, రాష్ట్రానికి పేరు తీసుకురావడం అభినందనీయమన్నారు. “సాధారణ క్రికెటర్లతో సమానంగా దివ్యాంగ క్రికెటర్లను కూడా గౌరవిస్తూ, వారి అభివృద్ధికి అవసరమైన సహాయ సహకారాలను అందించేందుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఎల్లప్పుడూ ముందుంటుంది. దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న క్రీడాకారులకు భద్రత, ప్రోత్సాహం కల్పించడం మా బాధ్యతగా భావిస్తున్నాం” అని ఆయన తెలిపారు.

దివ్యాంగ క్రికెటర్లకు ACA పూర్తి సహకారం : సానా సతీష్ బాబు
ఆంధ్రప్రదేశ్‌లో దివ్యాంగ క్రికెట్ అభివృద్ధికి ACA అన్ని విధాలా సహకరిస్తోందన్నారు. “క్రీడాకారులకు మెరుగైన శిక్షణ, అవసరమైన వసతులు, ప్రోత్సాహం మరియు భద్రత కల్పించడమే మా లక్ష్యం. దివ్యాంగ క్రికెటర్లు అంతర్జాతీయ స్థాయిలో మరింతగా రాణించేలా ఏ‌సి‌ఏ తన వంతు సహకారాన్ని కొనసాగిస్తుంది” అని ఆయన పేర్కొన్నారు.

అర్జున అవార్డు గ్రహీత అజయ్ కుమార్ రెడ్డి చొరవ
ఈ ఆరోగ్య బీమా పాలసీల ఏర్పాటుకు ముఖ్య ప్రేరణగా నిలిచిన భారత అంధుల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, అర్జున అవార్డు గ్రహీత శ్రీ ఇ. అజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, క్రీడాకారుల ఆరోగ్య భద్రత ఎంతో ముఖ్యమని అన్నారు. “నేను భారత జట్టు తరఫున ఆడుతున్న సమయంలో పలుమార్లు తీవ్ర గాయాలకు గురయ్యాను. ఆ సమయంలో సరైన ఆరోగ్య బీమా లేకపోవడంతో చికిత్స కోసం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. నా లాంటి పరిస్థితి మరే అంధ క్రికెటర్‌కు రాకూడదనే ఉద్దేశంతో అంతర్జాతీయ స్థాయిలో ఆడుతున్న మన ఐదుగురు అంధ క్రికెటర్లకు ఒక్కొక్కరికి ₹10 లక్షల ఆరోగ్య బీమా కల్పించేందుకు ముందుకొచ్చాను” అని అజయ్ కుమార్ రెడ్డి తెలిపారు.

బీమా పాలసీలు అందుకున్న ఐదుగురు అంతర్జాతీయ అంధ క్రికెటర్లు
1. దుర్గారావు – ప్రస్తుత భారత అంధుల క్రికెట్ జట్టు కెప్టెన్
2. వెంకటేష్ – అంతర్జాతీయ అంధ క్రికెటర్
3. రవి – అంతర్జాతీయ అంధ క్రికెటర్
4. దున్న వెంకటేశ్వరరావు – అంతర్జాతీయ అంధ క్రికెటర్
5. కుమారి సత్యవతి – అంతర్జాతీయ అంధ క్రికెటర్

అంతర్జాతీయ స్థాయిలో రాణించిన డెఫ్ క్రికెటర్లకు ఘన సన్మానం
ఇటీవల ఇంగ్లండ్‌లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో జరిగిన మిక్స్‌డ్ డిజేబుల్డ్ క్రికెట్ టోర్నమెంట్‌లో పాల్గొని దేశానికి గుర్తింపు తీసుకువచ్చిన డెఫ్ క్రికెటర్ యశ్వంత్ నాయుడును, అలాగే శ్రీలంకలో జరిగిన అంతర్జాతీయ డెఫ్ అండ్ డంబ్ ఉమెన్స్ క్రికెట్ టోర్నమెంట్‌లో ప్రతిభ కనబరిచిన కుమారి జోష్నా రెడ్డిని ఏ‌సి‌ఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ (చిన్ని), ప్రధాన కార్యదర్శి సానా సతీష్ బాబు ఘనంగా సన్మానించారు. వీరిని శాలువాలతో సత్కరించి, అంతర్జాతీయ స్థాయిలో వారి ప్రతిభను అభినందించారు.

ACAకు CABAP కృతజ్ఞతలు : క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఆంధ్రప్రదేశ్ (CABAP) రాష్ట్ర కార్యదర్శి జి. రవీంద్రబాబు మాట్లాడుతూ, దివ్యాంగ క్రికెట్ అభివృద్ధికి ACA అందిస్తున్న సహకారం అభినందనీయమన్నారు. “2025–26 ఆర్థిక సంవత్సరంలో దివ్యాంగుల క్రికెట్‌కు ACA అందించిన అపూర్వమైన ఆర్థిక సహకారానికి, క్రీడాకారులకు అందిస్తున్న నిరంతర ప్రోత్సాహానికి ఏ‌సి‌ఏ అధ్యక్షుడు, కార్యదర్శి మరియు యాజమాన్యానికి CABAP తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం” అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డిఫరెంట్లీ ఏబుల్డ్ క్రికెట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (DCCAP) ప్రధాన కార్యదర్శి శ్రీ సూర్యనారాయణ, వివిధ అసోసియేషన్ల ప్రతినిధులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest article

App Icon

Install Bharath Prathinidhi News App

Add to home screen for faster loading and latest updates.