Thursday, September 10, 2026
spot_imgspot_img

జయహో బీసీ నినాదం కాదు.. టీడీపీ విధానం

Must read

📰 Generate e-Paper Clip

ఎమ్మెల్యే గళ్ళా మాధవి

గుంటూరు, 19 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : “జయహో బీసీ” అనేది కేవలం నినాదం కాదని, బీసీల అభ్యున్నతి తెలుగుదేశం పార్టీ విధానంలో అంతర్భాగమని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి పేర్కొన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని, ఇది బీసీల రాజకీయ సాధికారతకు నూతన దిశానిర్దేశం చేస్తుందని ఆమె అన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచే బీసీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించిందని ఎమ్మెల్యే గుర్తు చేశారు. దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు నాలుగు దశాబ్దాల క్రితమే బీసీలకు రాజకీయ అవకాశాలు కల్పించి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులుగా ఎదిగే అవకాశం కల్పించారని తెలిపారు. 1987లో స్థానిక సంస్థల్లో 20 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన ఎన్టీఆర్ ప్రభుత్వం, అనంతరం 1995లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో వాటిని 34 శాతానికి పెంచి బీసీల రాజకీయ సాధికారతకు బలమైన పునాది వేసిందన్నారు.
1994లో పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాలకు సవరణలు చేసి గ్రామీణ స్థానిక సంస్థల్లో 34 శాతం, పట్టణ స్థానిక సంస్థల్లో 33.33 శాతం రిజర్వేషన్లు కల్పించి 1995 నుంచే అమలు చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం బీసీలకు స్థానిక సంస్థల్లో ఉన్న 34 శాతం రిజర్వేషన్లను 24 శాతానికి తగ్గించిందని విమర్శించారు. దీంతో దాదాపు 16,800 మంది బీసీలు స్థానిక సంస్థల పదవులకు దూరమయ్యారని అన్నారు. బీసీ నాయకత్వాన్ని అణచివేసి, సంక్షేమ పథకాలకు నిధులు తగ్గించి, బీసీ కార్పొరేషన్లను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. రెండు దశాబ్దాలుగా కొనసాగిన బీసీల రాజకీయ ప్రాతినిధ్యాన్ని కాపాడటంలో వైఎస్సార్సీపీ పూర్తిగా విఫలమైందన్నారు. బీసీలకు రాజకీయ, ఆర్థిక, సామాజిక న్యాయం చేయాలన్నదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు రాజకీయ గౌరవం, ఆర్థిక స్థిరత్వం, యువతకు విద్యా-ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా సమగ్ర చర్యలు చేపట్టిందన్నారు.
గత రెండేళ్లలో వివిధ సంక్షేమ పథకాల ద్వారా 1.17 కోట్ల మంది బీసీలకు రూ.32,534 కోట్ల ఆర్థిక సహాయం అందించామని పేర్కొన్నారు. వడ్డెర్లకు మైనింగ్ లీజులు, గీత కార్మికులకు ఎక్సైజ్ దుకాణాలు, నేతన్నలకు ఆర్థిక సాయం, మత్స్యకారులకు వేట విరామ సమయంలో రూ.20 వేల ఆర్థిక సహాయం, నాయీ బ్రాహ్మణుల సెలూన్లకు ఉచిత విద్యుత్, స్వర్ణకారుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని వివరించారు. బీసీలను కేవలం సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా కాకుండా ఆర్థికంగా, రాజకీయంగా బలమైన వర్గంగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆమె అన్నారు. బీసీ యువత, మహిళలకు గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు మరిన్ని రాజకీయ అవకాశాలు కల్పించి కొత్త తరం నాయకత్వాన్ని ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. రాష్ట్ర జనాభాలో బీసీలు 50.42 శాతం ఉన్నప్పటికీ నిర్ణయాధికారంలో వారికి తగిన స్థానం లేదని ఎమ్మెల్యే గళ్ళా మాధవి పేర్కొన్నారు. జనాభాకు తగిన ప్రాతినిధ్యం, ప్రాతినిధ్యానికి తగిన నిర్ణయాధికారం కల్పించాలన్నదే ప్రభుత్వ సంకల్పమని తెలిపారు. బీసీలకు చట్టబద్ధంగా మరింత ప్రాతినిధ్యం కల్పించే అంశంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పునరుద్ధరించడం ద్వారా గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కొత్త నాయకత్వం వెలుగులోకి వస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఇది కేవలం రిజర్వేషన్ నిర్ణయం మాత్రమే కాదని, బీసీ బిడ్డల సామాజిక గౌరవానికి ప్రభుత్వం ఇచ్చిన భరోసా అని పేర్కొన్నారు. ఎన్టీఆర్ ప్రారంభించిన బీసీ సాధికారత ప్రయాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మరో చారిత్రాత్మక అధ్యాయాన్ని జోడిస్తోందని ఎమ్మెల్యే అన్నారు. బీసీల అభివృద్ధి అంటే రాష్ట్ర అభివృద్ధి, బీసీల రాజకీయ సాధికారత అంటే ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడమేనని పేర్కొన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్న కూటమి ప్రభుత్వానికి బీసీ సమాజం రుణపడి ఉంటుందని ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలియజేశారు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest article

App Icon

Install Bharath Prathinidhi News App

Add to home screen for faster loading and latest updates.