Friday, September 11, 2026
spot_imgspot_img

ఆలా – పీఆర్ – ఏటుకూరిల ఉద్యమ ప్రస్థానం స్ఫూర్తిదాయకం

Must read

📰 Generate e-Paper Clip

కమ్యూనిస్టు ఉద్యమ నేతల సంస్మరణ సభలో ముప్పాళ్ళ నాగేశ్వరరావు

గుంటూరు, 26 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ప్రజల కోసం, ప్రజా ఉద్యమాల కోసం తమ జీవితాలను అంకితం చేసిన కమ్యూనిస్టు ఉద్యమ నేతలు అలానాగేశ్వరరావు, పీఆర్ ప్రకాష్ రావు , ఏటుకూరి ప్రసాద్ ల ఉద్యమ ప్రస్థానం నేటితరానికి స్ఫూర్తిదాయకమని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు అన్నారు. ఐదారు దశాబ్దాల పాటు భారత కమ్యూనిస్టు పార్టీ, ప్రజా సంఘాల అభ్యున్నతికి వారు చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. గుంటూరు మల్లయ్యలింగంభవన్లోని వీఎస్కే హాలులో సీపీఐ, రైతు, కార్మిక ఉద్యమ నేత అలా నాగేశ్వరరావు, శాంతి, స్నేహ సంఘం నాయకులు పీఆర్ ప్రకాష్ రావు, అరసం నేత, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ పూర్వ సంపాదకులు ఏటుకూరి ప్రసాద్ల సంస్మరణ సభ సీపీఐ గుంటూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం జరిగింది. ఈ సందర్భంగా వారి చిత్రపటాలకు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం సీపీఐ గుంటూరు జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి అధ్యక్షతన జరిగిన సభలో ముప్పాళ్ళ నాగేశ్వరరావు మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో గర్వించదగిన కమ్యూనిస్టు ఉద్యమ నాయకుల్లో ఈ ముగ్గురు నాయకులు ఉంటారని, పార్టీ రాజకీయ, సైద్ధాంతికత పట్ల నిబద్ధత కలిగి అంకితభావంతో పనిచేసేవారని అన్నారు. ప్రజా ఉద్యమాలకు, రైతు-కార్మిక పోరాటాలకు, అభ్యుదయ సాహిత్య రంగానికి ముగ్గురు నేతలు చేసిన సేవలు మరువలేనివని అన్నారు. ఏటుకూరి ప్రసాదు తెలుగు సాహిత్య, సాంస్కృతిక రంగాలకు విశేష సేవలందించారన్నారు. అభ్యుదయ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయన కీలక పాత్ర పోషించారని చెప్పారు. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ సంపాదక బాధ్యతలు నిర్వహించిన సమయంలో ప్రజా సాహిత్యానికి, ప్రగతిశీల రచనలకు ప్రాధాన్యం కల్పిస్తూ అనేక రచనలు, పుస్తకాలు పాఠకులకు చేరువయ్యేలా కృషి చేశారన్నారు.

అరసం నేతగా రచయితలు, కవులు, కళాకారులను ప్రజా సమస్యలపై స్పందించేలా ప్రోత్సహించారని తెలిపారు. అదేవిధంగా శాంతి, స్నేహ ఉ ద్యమ నేత పీఆర్ ప్రకాశ్ రావు ప్రజా ఉద్యమాలకు, శాంతి-సౌభ్రాతృత్వ పరిరక్షణకు చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ప్రజల్లో మానవతా విలువలు, పరస్పర స్నేహభావం, సామరస్యాన్ని పెంపొందించేందుకు ఆయన నిరంతరం కృషి చేశారని తెలిపారు. ప్రజా సమస్యలపై స్పందిస్తూ సామాజిక బాధ్యతతో పనిచేశారన్నారు. అలా నాగేశ్వరరావు నిరాడంబర జీవితం, ఉద్యమ నిబద్ధత, ప్రజల పట్ల అంకితభావం కార్యకర్తలకు స్ఫూర్తిదాయకంగా నిలిచాయి. పార్టీ కార్యకర్తలకు, యువతకు ఉద్యమ స్ఫూర్తిని అందించడంలో ఆయన కీలక పాత్ర పోషించారని అన్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ చరిత్రలో ముగ్గురు మూడు మచ్చుతునకలని అన్నారు. గుంటూరు జిల్లా ఉద్యమ నేపథ్యంలో వారిపాత్ర మరువలేనిదన్నారు. అరసం నేత ఏటుకూరి ప్రసాద్ ప్రజాస్వామ్య రక్షణకు రాసిన పాట నేటికి అందరి నోట నానుతుందన్నారు. అదేవిధంగా గుంటూరు ఏఐటీయూసీ చరిత్రలో పుష్కరకాలం పాటు సేవలందించిన అలా నాగేశ్వరరావు అనేక పోరాటాలు, ఉద్యమాలలో గణనీయమైన పాత్ర పోషించారని గుర్తుచేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్కమార్ మాట్లాడుతూ అలా నాగేశ్వరరావు లేకుంటే గుంటూరు నగర ఏఐఎస్ఎఫ్ చరిత్ర లేదని స్పష్టం చేశారు. ఏఐఎస్ఎఫ్ నాయకునిగా ఆనాడు ఆయన సాగించన పోరాటాలు ఎన్నటికీ మరువలేనివన్నారు. విద్యార్థి ఉద్యమాలలో అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించన సందర్భాలు అనేకం ఉన్నాయని చెప్పారు. మిగిలిన నేతలతో కూడా తనకున్న అనుబంధాన్ని జంగాల గుర్తుచేసుకున్నారు. ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జిల్లా అధ్యక్షుడు వల్లూరు తాండవ కృష్ణ, మాజీ కౌన్సిలర్ డాక్టర్ మామిళ్ళపల్లి అరుణ, హమాలీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు చల్లా చిన ఆంజనేయులు, సెంట్రల్ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ రాము, అవగాహన సంస్థ కార్యదర్శి కొండా శివరామిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు జొన్నలగడ్డ వెంకటరెడ్డి తదితరులు ప్రసంగించారు. తుదిశ్వాస వరకు తాము నమ్మిన సిద్ధాంతానికి వారు కట్టుబడి పనిచేశారని, వారి మరణం కమ్యూనిస్టు ఉద్యమాలకు తీరని లోటని అన్నారు. తొలుత సీపీఐ నగర కార్యదర్శి అకిటి అరుణ్ కుమార్ వక్తలను వేదికపైకి స్వాగతం పలికారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేడా హనుమంతరావు ముగింపు ఇచ్చారు. ఈ సభలో భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు పుప్పాల సత్యనారాయణ, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కొల్లి రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest article

App Icon

Install Bharath Prathinidhi News App

Add to home screen for faster loading and latest updates.