Thursday, September 10, 2026
spot_imgspot_img

చిలకలూరిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం

Must read

📰 Generate e-Paper Clip

ఏడుగురు మృతి
జీజీహెచ్‌లో క్షతగాత్రులను పరామర్శించిన వైఎస్సార్‌సీపీ గుంటూరు తూర్పు ఇన్‌ఛార్జ్ షేక్ నూరి ఫాతిమా
బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని డిమాండ్
చిలకలూరిపేట, 27 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్:
చిలకలూరిపేట పట్టణ పరిధిలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందారు. మరో ఏడుగురు తీవ్ర గాయాలతో గుంటూరు సర్వజనాసుపత్రి (జీజీహెచ్)లో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే గుంటూరు తూర్పు నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ షేక్ నూరి ఫాతిమా ఆసుపత్రికి చేరుకుని క్షతగాత్రులను, మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.
​వివరాల్లోకి వెళ్తే…
విజయవాడ నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న ప్రైవేట్ ఇంటర్‌సిటీ ట్రావెల్స్ బస్సు, ఆటోను బలంగా ఢీకొనడంతో ఈ ఘోర ప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో ఆటోలో డ్రైవర్‌తో సహా మొత్తం 14 మంది ప్రయాణిస్తున్నారు. వీరిలో ఐదుగురు ఘటనా స్థలంలోనే మృతి చెందగా, తీవ్ర గాయాలపాలైన వారిని మెరుగైన చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన ఏడుగురికి ప్రస్తుతం జీజీహెచ్ వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల పరిస్థితిపై షేక్ నూరి ఫాతిమా వైద్యులతో సమీక్షించి, వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు.
​బాధిత కుటుంబాలను ఆదుకోవాలి: షేక్ నూరి ఫాతిమా డిమాండ్
అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, ప్రైవేట్ బస్సు డ్రైవర్ అతివేగం, తీవ్ర నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘోర ప్రమాదం జరిగిందని, ఏడుగురి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిపారు. చనిపోయిన, గాయపడిన వారంతా రెక్కాడితే గాని డొక్కాడని రోజువారీ కూలీలని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుపేద కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణమే ఎక్స్‌గ్రేషియా మరియు తగిన ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా, ప్రమాదానికి బాధ్యులైన వారిపై సమగ్ర విచారణ జరిపి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest article

App Icon

Install Bharath Prathinidhi News App

Add to home screen for faster loading and latest updates.