గుంటూరు, 04 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : పిడుగురాళ్ల రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త అందించింది. రైలు నెం. 12795/12796 బి.జెడ్.ఎ–ఎల్.పి.ఐ–బి.జెడ్.ఎ ఇంటర్సిటీ ఎంప్లాయీ స్పెషల్‌కు సెప్టెంబర్ 4 నుంచి పిడుగురాళ్ల (పి.జి.ఆర్.ఎల్) రైల్వే స్టేషన్లో షెడ్యూల్డ్ స్టాపేజ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పిడుగురాళ్ల రైల్వే స్టేషన్లో నిర్వహించిన కార్యక్రమానికి నరసరావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు, గురజాల ఎమ్మెల్యే యరపాటినేని శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ జంగ కృష్ణమూర్తి హాజరయ్యారు. కార్యక్రమంలో సుమారు 400 మంది పాల్గొన్నారు. 12795 నంబర్ రైలు పిడుగురాళ్లకు రాత్రి 7.41 గంటలకు చేరుకుని, రెండు నిమిషాల అనంతరం 7.43 గంటలకు బయలుదేరింది. ఈ స్టాపేజ్‌తో పిడుగురాళ్లతో పాటు పరిసర ప్రాంతాల ప్రయాణికులకు మెరుగైన రైలు సౌకర్యం, కనెక్టివిటీ అందుబాటులోకి రానుంది. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు గుంటూరు డివిజన్ కట్టుబడి ఉందని దక్షిణ తీర రైల్వే తెలియజేసింది.


