Friday, September 11, 2026
spot_imgspot_img

గుంటూరులో రెవెన్యూ ఉద్యోగులకు మెగా ఉచిత వైద్య శిబిరం

Must read

📰 Generate e-Paper Clip

గుంటూరు, 22 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఉద్యోగులు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నప్పుడే ప్రజలకు సేవలు అందించేందుకు అవకాశం ఉంటుందని జిల్లా కలెక్టర్ సి యం. సాయి కాంత్ వర్మ అన్నారు. రెవెన్యూ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా శనివారం గుంటూరు నగరంలోని బిఆర్ స్టేడియంలో రెవెన్యూ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వీఆర్వో స్థాయి నుంచి డిప్యూటీ కలెక్టర్ల వరకు రెవెన్యూ శాఖకు చెందిన ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ఈ శిబిరంలో పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు.

ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ సాయి కాంత్ వర్మ మాట్లాడుతూ నిత్యం పని ఒత్తిడితో సహమతమయ్యే రెవెన్యూ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య సంరక్షణ కోసం మెగా మెడికల్ క్యాంపు నిర్వహించడం అభినందనీయమన్నారు. జిల్లాలోని ప్రతి రెవిన్యూ ఉద్యోగి వారి కుటుంబ సభ్యులతో ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఇందులో పాల్గొన్న వివిధ హాస్పిటల్ యాజమాన్యాలకు, డాక్టర్లకు తమ ధన్యవాదాలన్నారు.

గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మహ్మద్ నజీర్ అహ్మద్ మాట్లాడుతూ రెవెన్యూ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం అభినందనీయమన్నారు. జిల్లాలోని సుమారు 1,600 మంది రెవెన్యూ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులతో కలిపి 3,000 మందికి పైగా ఈ వైద్య శిబిరం ద్వారా సేవలు పొందుతున్నారని తెలిపారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా రెవెన్యూ ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తున్నారని ఎమ్మెల్యే నజీర్ పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ, ప్రతి గడపకూ చేర్చడంలో రెవెన్యూ సిబ్బంది చేస్తున్న సేవలు ఎంతో ముఖ్యమైనవన్నారు. నిరంతరం పని ఒత్తిడిలో విధులు నిర్వహించే ఉద్యోగులు తమ ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అనే స్ఫూర్తితో నిర్వహిస్తున్న ఈ మెగా హెల్త్ క్యాంప్‌ను రెవెన్యూ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే నజీర్ సూచించారు.

ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు మాట్లాడుతూ రెవెన్యూ శాఖలో పనిచేసే ఉద్యోగులు తీవ్ర పని ఒత్తిడితో విధులు నిర్వహిస్తున్నారని, ప్రభుత్వ విధానాల్లో మార్పులు, రైతాంగ సమస్యలు, భూ వివాదాలు, వివిధ రకాల పిటిషన్ల పరిష్కారం వంటి అంశాల్లో నిరంతరం ప్రజలతో మమేకమై పనిచేయాల్సి వస్తోందన్నారు. ఈ పని ఒత్తిడి ఉద్యోగుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్న నేపథ్యంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్డియాలజీ, ఆర్థోపెడిక్స్‌తో పాటు 8 రకాల ప్రధాన ఆరోగ్య సమస్యలకు సంబంధించి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు 33 మంది నిపుణులైన వైద్యులు, వైద్య సిబ్బంది శిబిరంలో పాల్గొన్నారని తెలిపారు. ముఖ్యమంత్రి ఆశయాలకనుగుణంగా ఆరోగ్యాంధ్ర లక్ష్య సాధనలో భాగంగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం సంతోషకరమన్నారు.

రెవెన్యూ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తీవ్రమైన పని ఒత్తిడి కారణంగా రెవెన్యూ ఉద్యోగులు తమ ఆరోగ్యాన్ని పట్టించుకోలేని పరిస్థితి ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ ఉద్యోగుల కోసం ఇలాంటి మెగా వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముందస్తుగా ఆరోగ్య సమస్యలను గుర్తించి, అవసరమైన వైద్య చికిత్స పొందేందుకు ఈ శిబిరాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీ వాస్తవ, ఆర్డీఓ శ్రీనివాసరావు, డి యం హెచ్ ఓ విజయలక్ష్మి, తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులు, వైద్యులు, వైద్య సిబ్బంది, రెవెన్యూ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల నుంచి మెగా హెల్త్ క్యాంప్‌కు విశేష స్పందన లభించింది.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest article

App Icon

Install Bharath Prathinidhi News App

Add to home screen for faster loading and latest updates.