అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ
గుంటూరు, 29 జూలై 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : రాష్ట్రస్థాయి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు రాజధాని ప్రాంతంలోని పెరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ సి యం. సాయికాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో రాష్ట్రస్థాయి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల వారీగా చేపట్టాల్సిన ఏర్పాట్లను, అధికారులకు కేటాయించాల్సిన బాధ్యతలను సమీక్షించారు. వేడుకలకు రాష్ట్రస్థాయి ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల అధికారులు, ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. వేదిక, పరేడ్, సీటింగ్, బారికేడింగ్, విద్యుత్, తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్య సదుపాయాలు, పార్కింగ్ తదితర ఏర్పాట్లను సంబంధిత శాఖలు సమన్వయంతో చేపట్టాలన్నారు. అదేవిధంగా భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్, అత్యవసర సేవలకు సంబంధించి ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. వేడుకలకు హాజరయ్యే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పరేడ్‌లో పాల్గొనే పోలీసు, ఎన్సీసీ, విద్యార్థులు, ఇతర బృందాలకు అవసరమైన ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని, కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ స్పష్టం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, డీఆర్ఓ ఖాజావలి, ఆర్ డి ఓ శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


