గుంటూరు, 31 జూలై 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల సవరణ ముసాయిదా ఓటర్ల జాబితాను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శుక్రవారం విడుదల చేశారని, ఈ ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు లేదా సవరణలు అందించేందుకు ఆగస్టు 30 వరకు అవకాశం కల్పించారని గుంటూరు తూర్పు ఈఆర్ఓ, నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ముసాయిదాపై అందిన అభ్యంతరాలను జూలై 31 నుండి సెప్టెంబర్ 28 లోపు పరిష్కరించి, అక్టోబర్ 3వ తేదీన తుది ఓటర్ల జాబితాని ఎన్నికల సంఘం విడుదల చేస్తుందని పేర్కొన్నారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో ముసాయిదాని బిఎల్ఓ లు పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉంచుతారని, ప్రజలు తమ ఓటు చూసుకోవడానికి ఆన్ లైన్ ద్వారా ఓటర్ హెల్ప్ లైన్, ఈసిఐ యాప్ ల ద్వారా చెక్ చేసుకోవచ్చని తెలిపారు. అభ్యంతరాలను ఆన్ లైన్ ద్వారా, బిఎల్ఓలకు, నగరపాలక సంస్థ ఎన్నికల విభాగంలో అందించవచ్చన్నారు. అర్హులైన వారు ఎవరైనా ఉంటే ఫామ్-6 ద్వారా నూతన ఓట్ల కోసం నమోదు చేసుకోవచ్చని తెలిపారు.



Good