Thursday, September 10, 2026
spot_imgspot_img

ఆర్‌అండ్‌బీ జూనియర్ అసిస్టెంట్‌ సాయి లక్ష్మి ఇంట్లో వ్యభిచార దందా !

Must read

📰 Generate e-Paper Clip

వాకలాపూడిలో పోలీసుల దాడి
సాయి లక్ష్మి, సహనిందితుడు అరెస్టు
తెలంగాణ మహిళను రెస్క్యూ చేసిన పోలీసులు
ముగ్గురు కస్టమర్లు పట్టివేత
మహిళలను సమకూర్చిన మూడో నిందితుడు పరారీ
గాలింపుముమ్మరం
ఆగస్టు 2నే ఈఈకి లేఖ రాసిన సీఐ చాళుమూరి ప్రకాష్
ఎనిమిది రోజులైనా కదలని ఫైలు
సర్కారు ఉద్యోగినేనా ఇది అని విస్మయం వ్యక్తం చేస్తున్న అధికారులు
ఇంకా విధుల్లోనే సాయి లక్ష్మి
చర్యలపై నీళ్లు నమిలుతున్న ఆర్ అండ్ బి ఎస్ఈ

కాకినాడ బ్యూరో, 10 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : పగలంతా సర్కారు ఫైళ్లు తిప్పే ఆ చేతులే, రాత్రి కాగానే వ్యభిచార దందాకు అడ్డా నడిపాయంటే నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం. కాకినాడ రూరల్ మండలం వాకలాపూడి గ్రామంలో నడుస్తున్న ఓ రహస్య దందాపై సర్పవరం పోలీసులు ఈనెల 1న దాడి చేయగా, ఆర్‌అండ్‌బీ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న ఓ మహిళా ఉద్యోగినే ఇందులో సూత్రధారిగా బయటపడింది. ఈ విషయం తెలిసి అధికార వర్గాలే నోరెళ్లబెట్టాయి.
సంగతేంటంటే.. మధురాపురం, వాకలాపూడి గ్రామంలోని డోర్ నెంబర్ 4-67/3 అద్దె ఇంటిపై చాలా రోజులుగా అనుమానం ఉంది. బయటకు మామూలు ఇంటిలానే కనిపించినా, లోపల నడుస్తున్నది మాత్రం వేరే వ్యవహారమని విశ్వసనీయ సమాచారం అందటంతో సర్పవరం సీఐ చాళుమూరి ప్రకాష్ రంగంలోకి దిగారు. మధ్యవర్తులు, సిబ్బందిని వెంటబెట్టుకుని ఈనెల 1న మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఆ ఇంటిపై అనుకోకుండా దాడి చేశారు. లోపలికి వెళ్లేసరికి అసలు గుట్టు రట్టైంది. రేపూరు గ్రామానికి చెందిన రాంభట్ల సాయి లక్ష్మి అలియాస్ వేదుల వెంకట నాగ సూర్య నరసాయి (57), జగ్గంపేట మండలం రామవరం గ్రామానికి చెందిన కరణం నాగేంద్రబాబు అలియాస్ వంశీ (25).. ఈ ఇద్దరూ కలిసి ఆ ఇంటిని వ్యభిచార అడ్డాగా మార్చేసినట్టు తేలింది. తెలంగాణ నుంచి తీసుకొచ్చిన 32 ఏళ్ల మహిళను బాధితురాలిగా గుర్తించి పోలీసులు రక్షించగా, ముగ్గురు కస్టమర్లు కూడా చేతికి చిక్కారు.
విచారణలో ఇద్దరు నిందితులు నోరు జారారు. ఇంటిని తామే అద్దెకు తీసుకున్నామని, ఒంగోలుకు చెందిన కుంచల అంకమరావు అలియాస్ శ్రీనివాస్ సాయంతో వ్యభిచారం నడుపుతున్నామని పోలీసుల ముందు ఒప్పుకున్నారు. మహిళలను వలలో వేసి తెచ్చే పనిలో ఉన్న అంకమరావు మాత్రం పోలీసుల కళ్లుగప్పి ఇప్పటికీ పరారీలోనే ఉన్నాడు. సంఘటనా స్థలంలో మూడు సెల్‌ఫోన్లు, రూ.1,000 నగదు, కండోమ్ ప్యాకెట్లు దొరికాయి. సర్పవరం పోలీస్ స్టేషన్‌లో బీఎన్ఎస్ సెక్షన్ 144(2) ఆర్‌డబ్ల్యూ 3(5)తో పాటు, ఇమ్మోరల్ ట్రాఫిక్ (ప్రివెన్షన్) చట్టం సెక్షన్లు 3(2)(ఎ), 4(1), 5(1)(ఎ), 7(1)(బి) కింద కేసు (నెంబర్ 244/2026) నమోదైంది.
అసలు కథ ఇక్కడే మలుపు తిరిగింది. ప్రధాన నిందితురాలు సాయి లక్ష్మి మామూలు మనిషేమీ కాదు, కాకినాడలోని రోడ్లు భవనాల శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా సర్కారు జీతం తీసుకుంటున్న ఉద్యోగినే! ఇది తెలియగానే సర్పవరం సీఐ చాళుమూరి ప్రకాష్ ఆలస్యం చేయలేదు. ఆగస్టు 2నే ఆర్‌అండ్‌బీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌కు లేఖ రాశారు. ఎఫ్‌ఐఆర్ ప్రతిని జతచేసి, సర్వీసు నిబంధనల ప్రకారం తగిన శాఖాపరమైన చర్య తీసుకోవాలని కోరారు. కానీ ఈ లేఖ ఈఈ కార్యాలయానికి చేరేసరికే ఎనిమిది రోజులు గడిచిపోయి ఈనెల 10 అయిపోయింది. ఇంత సున్నితమైన అంశంపై కూడా ఫైలు కదలడానికి ఇన్ని రోజులా అన్న ప్రశ్న ఇప్పుడు అందరి నోళ్లలో నానుతోంది.
ఇలాంటి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగిపై ఏపీ సివిల్ సర్వీసెస్ నిబంధనలు–1991లోని నిబంధన 8 ప్రకారం సస్పెన్షన్ వేటు వేయాలన్నది స్పష్టమే. అయితే 48 గంటలలోపే స్టేషన్ బెయిల్ రావడంతో, ఆటోమేటిక్‌గా వర్తించే ‘డీమ్డ్ సస్పెన్షన్’ నిబంధన ఆమెకు వర్తించకపోవచ్చు. కానీ కేసు దర్యాప్తులో ఉన్నందున, తనంతట తానే విచక్షణాధికారంతో సస్పెన్షన్ ఆర్డర్ ఇచ్చే అధికారం ఆర్&బి సూపరింటెండెంట్ ఇంజనీర్ కి ఉందని న్యాయ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. ఇంత సీరియస్ కేసులో నిందితురాలు ఇంకా విధుల్లో కొనసాగుతుండటం ఎంతవరకు సబబో ఈఈ, ఎస్ ఈ నే సమాధానం చెప్పాల్సి ఉంది. ప్రస్తుతానికి కేసు దర్యాప్తు దశలోనే ఉంది. నిందితులపై ఆరోపణలు కోర్టులోనే రుజువు కావాలని, తుది తీర్పు అక్కడే వెలువడుతుందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. కానీ సర్కారు కొలువులో ఉంటూ ఇలాంటి దందాలు నడిపేవారిపై శాఖలు ఎంత వేగంగా స్పందిస్తాయన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న?.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest article

App Icon

Install Bharath Prathinidhi News App

Add to home screen for faster loading and latest updates.