మాజీ శాసనసభ్యులు పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి నివాసంలో హాజరైన జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ చార్జీలు
పార్టీ బలోపేతం, అభివృద్ధి కార్యక్రమాలపై కీలక చర్చలు
కాకినాడ బ్యూరో, 30 జూలై 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : కాకినాడ రూరల్ పరిధిలోని వలసపాకలలో ఉన్న మాజీ శాసనసభ్యులు పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి నివాసంలో జిల్లా పార్టీ నేతల ఆత్మీయ విందు కార్యక్రమం జరిగింది. టీడీపీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌ల సమన్వయంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమ్మేళనం కేవలం విందుకే పరిమితం కాకుండా పార్టీ భవిష్యత్ కార్యాచరణకు వేదికగా నిలిచింది. ఈ సందర్భంగా నాయకులంతా ఒకచోట చేరి జిల్లాలో పార్టీ బలోపేతంపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రధానంగా గత రెండేళ్ల పాలనలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికీ తీసుకెళ్లడం, భవిష్యత్తులో చేపట్టాల్సిన పనులు తదితర కీలక అంశాలపై నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. నాయకుల మధ్య సమన్వయం పెంచేందుకు రాబోయే రోజుల్లో జిల్లా వ్యాప్తంగా ఇటువంటి ఆత్మీయ సమావేశాలు మరిన్ని నిర్వహిస్తామని పార్టీ జిల్లా అధ్యక్షులు నవీన్ సహా ఇతర నేతలు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ ఆత్మీయ విందు కార్యక్రమంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు, జగ్గంపేట ఎమ్మెల్యే, టీటీడీ పాలకమండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ, ఎమ్మెల్సీలు పేరాబత్తుల రాజశేఖర్, కర్రి పద్మశ్రీ, కాకినాడ రూరల్ ఇన్ఛార్జ్ పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.


