న్యూఢిల్లీ, 29 జులై 2026, భారత్ ప్రతినిధి : జాతీయ గేయం ‘వందేమాతరం’ గౌరవాన్ని కాపాడేందుకు ఉద్దేశించిన కీలక బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ నెల 24వ తేదీన ఎగువసభలో ఈ బిల్లును ప్రవేశపెట్టగా.. నేడు (బుధవారం) సుదీర్ఘ చర్చ అనంతరం సభ ఆమోదముద్ర వేసింది. ఇకపై వందేమాతరాన్ని అవమానించినా, లేదా ఎవరైనా ఆలపిస్తున్న సమయంలో ఉద్దేశపూర్వకంగా ఆటంకం కలిగించినా దాన్ని చట్టప్రకారం తీవ్ర నేరంగా పరిగణించేలా చట్టం చేయనున్నారు. వందేమాతరం బిల్లులో భాగంగా చరిత్రాత్మక ‘ది ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ ఆనర్ యాక్ట్ – 1971’ (జాతీయ గౌరవానికి భంగం కలిగించే నిరోధక చట్టం)లో కీలక సవరణలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రస్తుతం భారత జాతీయ గీతమైన ‘జనగణమన’కు ఎలాంటి చట్టపరమైన రక్షణలు అమల్లో ఉన్నాయో.. అవే అత్యున్నత రక్షణలను జాతీయ గేయమైన వందేమాతరానికి కూడా వర్తింపజేయడమే ఈ బిల్లు ముఖ్య ఉద్దేశమని కేంద్రం స్పష్టం చేసింది.


