గుంటూరు, 15 సెప్టెంబర్ 2026. భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు నగరంలో గుంతలు లేని రోడ్లే లక్ష్యంగా పనిచేయాలని, అన్ని రోడ్లలోని పాట్‌హోల్స్‌ను యుద్ధప్రాతిపదికన పూడ్చాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కమిషనర్ విద్యా నగర్, వికాస్ నగర్, జేకేసి కాలేజీ రోడ్ తదితర ప్రాంతాల్లో పర్యటించి, అభివృద్ధి, పారిశుధ్య పనులను తనిఖీ చేసి, అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, వర్షాల నేపథ్యంలో నగరంలోని ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాల్లో ఎక్కడా నీరు నిలవకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్లపై పాట్ హోల్స్ మరమత్తుకు తక్షణ అనుమతులు ఇస్తున్నాచేయించడంలో ఇంజినీరింగ్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై అసహనం వ్యక్తం చేస్తూ, అటువంటి సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. టెండర్లు పూర్తయి వర్క్ ఆర్డర్లు పొందినా పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లకు వెంటనే నోటీసులు జారీ చేసి, సదరు వర్క్ లను రద్దు చేయాలని ఆదేశించారు. రహదారులు, డ్రెయిన్ల పక్కన నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణ సామాగ్రిని వేస్తె తక్షణమే సీజ్ చేయాలని, ఉల్లంఘనలు పునరావృతమైతే సంబంధిత నిర్మాణాలకు వర్క్ స్టాప్ ఆర్డర్లు ఇవ్వాలని స్పష్టం చేశారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తయారీ యూనిట్లను తక్షణమే గుర్తించి సీజ్ చేయాలని సిఎంఓహెచ్‌ను ఆదేశించడంతో పాటు దుకాణాల్లో శానిటరీ ఇన్స్పెక్టర్లు నిరంతరం తనిఖీలు చేయాలన్నారు. అలాగే వినాయక చవితి మండపాల వద్ద తప్పనిసరిగా డస్ట్ బిన్లు ఏర్పాటు చేసి పరిశుభ్రత పాటించేలా మండపాల నిర్వహకులతో అధికారులు సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఈ పర్యటనలో ఎస్ఈ సుందర్రామిరెడ్డి, సిఎంఓహెచ్ డాక్టర్ శాంతికళ, ఎంహెచ్ఓ డాక్టర్ సురేష్ బాబు, ఈఈ విష్ణు వర్ధన్, డిఈఈ వెంకటరమణ, ఎస్ఎస్ సోమశేఖర్, ప్రజారోగ్య, పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్ అధికారులు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.


