గుంటూరు, 08 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : సమాజం పట్ల ప్రతి విద్యార్థి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రముఖ సినీ దర్శకుడు, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థి బోయపాటి శ్రీను సూచించారు. విద్యార్థులు చదువుతో పాటు విజ్ఞత, సంస్కారం, లౌక్యం, బాధ్యతాయుతమైన లక్షణాలను అలవరచుకోవాలని కోరారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం స్వర్ణోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తాను ఏఎన్యూ పూర్వ విద్యార్థినని, విశ్వవిద్యాలయం అందించిన సర్టిఫికెట్ తన సినీ జీవితంలో ఎంతో కీలకంగా నిలిచిందని తెలిపారు. ఆ సర్టిఫికెట్ తనను సినీ దర్శకుడిగా ఎదగడానికి దోహదపడిందని గుర్తుచేసుకున్నారు. ప్రతి విద్యార్థి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును, నైపుణ్యాన్ని, సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. చదువుతోపాటు వ్యక్తిత్వ వికాసానికి ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. సమాజంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ క్రమంగా కనుమరుగవుతుండటం బాధాకరమన్నారు.
మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి : నేటి సమాజాన్ని పట్టిపీడిస్తున్న ప్రధాన సమస్యల్లో మాదక ద్రవ్యాల వినియోగం ఒకటని బోయపాటి శ్రీను అన్నారు. విద్యార్థి దశ నుంచే డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని సూచించారు. అదే విధంగా మొబైల్ ఫోన్లకు బానిసలుగా మారకుండా వాటిని అవసరమైన మేరకే వినియోగించాలని హితవు పలికారు. రాష్ట్రాన్ని విద్యా, వ్యాపార కేంద్రంగా తీర్చిదిద్దే నాయకులను గుర్తించి ప్రోత్సహించాలని విద్యార్థులకు సూచించారు. రాజధాని నిర్మాణంలో ఎన్నో ఆటంకాలు ఎదురైనా రాష్ట్రాన్ని ప్రగతి పథంలోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్న నాయకత్వాన్ని గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. తనకు ఏఎన్యూతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, విశ్వవిద్యాలయం పరిధిలోని నంబూరు, కాజా, పెద్దకాకాని గ్రామాల్లో తాను గతంలో సంచరించిన విషయాలను బోయపాటి శ్రీను గుర్తుచేసుకున్నారు.
అలరించిన సంగీత విభావరి : స్వర్ణోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ‘పాడుతా తీయగా’ ఫైనలిస్ట్ సూర్య కార్తీక్, శ్రీలత బృందం అందించిన సంగీత విభావరి ఆహూతులను అలరించింది. పాటలు, నృత్యాలతో పాటు విశ్వవిద్యాలయ విద్యార్థులు ప్రదర్శించిన వివిధ కళారూపాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. విద్యార్థుల కళా ప్రతిభకు సభికుల నుంచి విశేష స్పందన లభించింది.
విద్యార్థులు బాధ్యతతో మెలగాలి : బోయపాటి శ్రీను


