Friday, September 11, 2026
spot_imgspot_img

వీఎంసీలో డీజిల్ దోపిడీకి అడ్డూ అదుపు లేదా ?

Must read

📰 Generate e-Paper Clip

సింగ్‌నగర్ రైతుబజార్‌ కేంద్రంగా అక్రమాల ఆరోపణలు

కదలని వాహనానికి రోజూ 36 లీటర్ల డీజిల్‌ ఎలా?

లాగ్‌బుక్‌లలో మాయాజాలమా.. అధికారుల పర్యవేక్షణపై అనుమానాలు

విజయవాడ, 05 సెప్టెంబర్ 2026, భారత ప్రతినిధి న్యూస్ : విజయవాడ నగరపాలక సంస్థ (వీఎంసీ)లో ప్రజాధనం దుర్వినియోగంపై మరోసారి ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. సింగ్‌నగర్ రైతుబజార్‌ పరిసరాలను కేంద్రంగా చేసుకుని మున్సిపల్ వాహనాలకు కేటాయించే డీజిల్‌ వినియోగంలో అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విధుల్లో భాగంగా క్షేత్రస్థాయిలో తిరగాల్సిన ఓ వాహనం చాలాకాలంగా ఒకేచోటే నిలిచి ఉంటున్నప్పటికీ, రికార్డుల్లో మాత్రం వాహనం తిరిగినట్లు కిలోమీటర్లు నమోదు చేస్తున్నారనే ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. రోజుకు సుమారు 36 లీటర్ల డీజిల్‌ కేటాయింపు జరుగుతున్నట్లు ఆరోపణలు ఉండగా, అందులో కొంత ఇంధనం వాహనంలో వినియోగించకుండా క్యాన్లలోకి తరలిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కదలని వాహనానికి ఇంత డీజిల్‌ ఎలా ?
వాహనం వాస్తవంగా క్షేత్రస్థాయిలో తిరగకపోతే రోజువారీగా ఇంత భారీ మొత్తంలో డీజిల్‌ ఎలా ఖర్చవుతోంది? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వాహనం కిలోమీటర్‌ రీడింగ్‌, లాగ్‌బుక్‌, డీజిల్‌ జారీ రిజిస్టర్లు, బిల్లులు, వినియోగ వివరాలు సమగ్రంగా పరిశీలిస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
ఒక్కరి పని కాదు.. అండ ఎవరిది?
డీజిల్‌ వినియోగంలో అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు నిజమైతే, అది కేవలం డ్రైవర్‌ స్థాయిలోనే సాధ్యమయ్యే వ్యవహారమా? లేక సంబంధిత సిబ్బంది, పర్యవేక్షణాధికారుల పాత్ర కూడా ఉందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వాహనాల నిర్వహణ, లాగ్‌బుక్‌ల పరిశీలన, ఇంధన వినియోగంపై పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు ఇంతకాలం ఏం చేస్తున్నారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
సీసీ కెమెరాలే అసలు సాక్ష్యాలా?
సింగ్‌నగర్ రైతుబజార్‌ పరిసరాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తే వాహనం వాస్తవంగా ఎక్కడ తిరిగింది, ఎంతసేపు అక్కడ నిలిచింది వంటి అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. డీజిల్‌ను క్యాన్లలోకి తరలించారనే ఆరోపణలపైనా ఫుటేజీ ద్వారా నిజానిజాలు తేలే అవకాశం ఉంది. అందువల్ల గత కొన్ని నెలలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలు, వాహన లాగ్‌బుక్‌లు, కిలోమీటర్‌ రీడింగ్‌లు, డీజిల్‌ బిల్లులు, ఇంధన జారీ రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకుని సమగ్రంగా పరిశీలించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
ప్రజాధనంపై ఆరోపణలు వస్తున్నా ఎందుకు మౌనం?
ప్రజల నుంచి పన్నులు వసూలు చేస్తున్న వీఎంసీ.. నగరంలో అనేక మౌలిక వసతులకు నిధుల కొరత ఉందని చెబుతున్న సమయంలో, ఇంధన వినియోగంపై ఇలాంటి ఆరోపణలు రావడం విమర్శలకు తావిస్తోంది. ఆరోపణల్లో వాస్తవం ఉంటే ప్రజాధనానికి నష్టం కలిగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు. డీజిల్‌ వినియోగంపై సమగ్ర ఆడిట్‌ నిర్వహించి, వాహనాల లాగ్‌బుక్‌లు, కిలోమీటర్‌ రీడింగ్‌లు, డీజిల్‌ బిల్లులు, జారీ రిజిస్టర్లు, సీసీటీవీ ఫుటేజీలను పరస్పరం సరిపోల్చి విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై శాఖాపరమైన చర్యలతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుని, ప్రజాధనానికి జరిగిన నష్టాన్ని రికవరీ చేయాలని కోరుతున్నారు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest article

App Icon

Install Bharath Prathinidhi News App

Add to home screen for faster loading and latest updates.