Friday, September 11, 2026
spot_imgspot_img

అక్రమ నిర్మాణ మాఫియా బెదిరింపులు !

Must read

📰 Generate e-Paper Clip

ఖాకీ పలుకుబడితో దౌర్జన్యాలు..
లంచాలతో టౌన్ ప్లానింగ్ నోటికి తాళం !
రవీంద్రనగర్‌లో అనుమతులు లేని అడ్డగోలు కట్టడం..
OC లేకుండానే ఏళ్ల తరబడి పన్నుల దోపిడీ
ప్రశ్నించిన సహచరుడికే ‘చంపేస్తాం’ అంటూ బెదిరింపులు..
ఫోర్జరీ సంతకాలతో దొంగ దస్త్రాలు !

గుంటూరు, 24 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు నగర పాలక సంస్థను తమ బానిస సంస్థగా మార్చుకుని, చట్టాలను బూట్ల కింద తొక్కుతూ బరితెగించిన అక్రమ నిర్మాణాల మాఫియా బాగోతం పట్టాభిపురం వేదికగా బట్టబయలైంది. అనుమతుల్లేని బహుళ అంతస్తుల కట్టడాలతో ప్రభుత్వ ఖజానాకు లక్షల్లో గండి కొట్టడమే కాక, పోలీసు పలుకుబడిని అడ్డం పెట్టుకుని ప్రశ్నించిన వాటాదారుడి గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తున్న ముఠా దాష్టీకం సోమవారం నగరపాలక సంస్థ గ్రీవెన్స్‌లో తీవ్ర కలకలం రేపింది.
​అనుమతుల్లేవు.. ఆక్యుపెన్సీ లేకుండానే దర్జాగా కాపురం!
పట్టాభిపురం రవీంద్రనగర్‌లో ఎలాంటి అధికారిక అనుమతులు, ప్లాన్ అప్రూవల్స్, చివరకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (OC) లేకుండానే ఒక భారీ అక్రమ భవనాన్ని నిర్మించేశారు. గత మూడేళ్లుగా గవిని రత్న చౌదరి, గవిని భార్గవ్ రాము, ముప్పనేని మల్లికార్జునరావు, కొల్లూరు పద్మావతి, గవిని వామనమూర్తి అనే వ్యక్తులు అందులో దర్జాగా నివాసముంటూ మున్సిపల్ పన్నులను నిలువునా ఎగ్గొడుతున్నారు. కనీస పర్మిషన్ లేని కట్టడానికి మంచినీటి కనెక్షన్లు, కరెంట్ మీటర్లు ఎలా కేటాయించారో టౌన్ ప్లానింగ్ అధికారుల ముడుపుల మత్తుకు ప్రత్యక్ష నిదర్శనం.
​‘లక్షలు పోసి అధికారులను కొన్నాం’.. బరితెగించిన ఖాకీ ముఠా!
వాటాదారుల మధ్య వివాదాలు తలెత్తడంతో బాధితుడు తన ప్లాట్‌ను అమ్ముకునేందుకు యత్నించగా, ఈ ముఠా అరాచకానికి తెరలేపింది. తాము నిర్ణయించిన కారుచౌక ధరకే తమ వాళ్లకే రాసివ్వాలని బెదిరింపులకు దిగారు. బాధితుడు రాకపోకలు సాగించకుండా ఇంటి ముఖద్వారాన్ని చెక్కలతో మూసివేసి గూండాయిజం ప్రదర్శించారు. నిందితుల్లో వామనమూర్తి భార్య పోలీసు విభాగంలో పనిచేస్తుండటంతో “మమ్మల్ని ఎవడూ ఏమీ చేయలేడు.. కార్పొరేషన్ అధికారులకే లక్షలు పోసి కొనేశాం” అంటూ అత్యంత అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డారు. అంతేకాక, బాధితుడి సంతకాన్ని ఫోర్జరీ చేసి దొంగ దస్త్రాలతో అనుమతుల కోసం ప్రయత్నించినట్లు బాధితుడు వాపోయారు.
కమిషనర్‌ను మోసం చేస్తున్న కిందిస్థాయి అవినీతి తిమింగలాలు!
కార్పొరేషన్ కమిషనర్ నిజాయితీ గల అధికారి అయినప్పటికీ, లంచాలకు మరిగిన కిందిస్థాయి సిబ్బంది అక్రమార్కులతో కుమ్మక్కై ఫిర్యాదులను బుట్టదాఖలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ ఖజానాను కొల్లగొడుతూ, ఫోర్జరీలు, రౌడీయిజానికి పాల్పడుతున్న ఈ ముఠాపై తక్షణమే క్రిమినల్ కేసులు పెట్టి, అక్రమ నిర్మాణాన్ని సీజ్ చేయాలని నగర ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest article

App Icon

Install Bharath Prathinidhi News App

Add to home screen for faster loading and latest updates.