Thursday, September 10, 2026
spot_imgspot_img

అభివృద్ధి కార్యక్రమాలపై గుంటూరు కలెక్టర్‌ సి.యం. సాయి కాంత్ వర్మ సమీక్ష

Must read

📰 Generate e-Paper Clip

గుంటూరు, 17 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో నిర్వహించనున్నందున, నిర్నీత షెడ్యూల్ ప్రకారం ఓటర్ వెరిఫికేషన్ పూర్తి చేసేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్‌ సి యం సాయి కాంత్ వర్మ ఆదేశించారు. సోమవారం ఎంపీడీఓలు, మున్సిపల్‌ కమిషనర్లతో జిల్లా కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, రెవెన్యూ అంశాలు, ఆధార్‌ కార్డులు లేని యానాది కుటుంబాల గుర్తింపు, గ్రీన్‌ గుంటూరు, క్రాప్‌ ఇన్సూరెన్స్‌, వి.బి.జి. రామ్‌జీ తదితర అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం, ఎన్నికల సంఘం నుంచి అందే మార్గదర్శకాలను క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాలు, పోలింగ్‌ కేంద్రాల పరిస్థితి, సిబ్బంది సమన్వయం తదితర అంశాలపై ముందస్తుగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
పీజీఆర్‌ఎస్‌ అర్జీలపై ప్రత్యేక దృష్టి : ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో ప్రజలు అందజేసిన అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అర్జీల పరిష్కారంలో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు, పెండింగ్‌లో ఉన్న అర్జీలను ప్రత్యేకంగా సమీక్షించి త్వరితగతిన పరిష్కరించాలని ఎంపీడీఓలు, మున్సిపల్‌ కమిషనర్లను ఆదేశించారు.
రెవెన్యూ సమస్యల పరిష్కారానికి చర్యలు : ప్రజలకు సంబంధించిన రెవెన్యూ సమస్యలను కూడా ప్రాధాన్యతతో పరిష్కరించాలని కలెక్టర్‌ సూచించారు. భూ సంబంధిత సమస్యలు, ధ్రువీకరణ పత్రాలు, ఇతర రెవెన్యూ సేవలకు సంబంధించి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకొని పరిష్కరించాలని తెలిపారు.
కార్డులు లేని యానాదుల గుర్తింపు : జిల్లాలో ఆధార్‌ కార్డులు లేని యానాది కుటుంబాలను క్షేత్రస్థాయిలో గుర్తించి, వారికి ఆధార్‌ కార్డులు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఆదేశించారు. సంబంధిత గ్రామాలు, నివాస ప్రాంతాలను అధికారులు సందర్శించి అర్హులైన వారిని గుర్తించాలని, అవసరమైన పత్రాలు, వివరాలను సేకరించి ఆధార్‌ నమోదు ప్రక్రియను సులభతరం చేయాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
గ్రీన్‌ గుంటూరు కార్యక్రమంపై సమీక్ష : గ్రీన్‌ గుంటూరు కార్యక్రమం కింద చేపడుతున్న పచ్చదనం, మొక్కల పెంపకం, వాటి సంరక్షణ కార్యక్రమాల పురోగతిని కలెక్టర్‌ సమీక్షించారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించేలా బాధ్యతలు కేటాయించాలని, మొక్కల జీవన శాతం పెంచేందుకు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో పచ్చదనం పెంపొందించే కార్యక్రమాలను ప్రజల భాగస్వామ్యంతో మరింత విస్తృతంగా చేపట్టాలని ఆదేశించారు.
క్రాప్‌ ఇన్సూరెన్స్‌పై రైతులకు అవగాహన : పంటల బీమా పథకం అమలుపై కూడా కలెక్టర్‌ సమీక్షించారు. అర్హులైన రైతులందరూ పంటల బీమా ప్రయోజనం పొందేలా వ్యవసాయ శాఖ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది అవగాహన కల్పించాలని సూచించారు. పంటల బీమా ప్రాముఖ్యతను రైతులకు వివరించి, అర్హత కలిగిన రైతులు తప్పనిసరిగా బీమా పరిధిలోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిదంగా జిల్లాలో అమలవుతున్న వి.బి.జి. రామ్‌జీ కింద చేపడుతున్న పనులను నిర్దేశిత లక్ష్యాల మేరకు వేగవంతంగా పూర్తి చేయాలని, క్షేత్రస్థాయిలో పనుల నాణ్యతను అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. అభివృద్ధి పనుల్లో జాప్యం లేకుండా సంబంధిత శాఖల మధ్య సమన్వయం పెంచుకోవాలని తెలిపారు. ప్రతి అంశంలో పురోగతిని క్రమం తప్పకుండా సమీక్షిస్తూ, నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీ వాస్తవ, డిఆర్ఓ ఖాజావలి, ఆర్డీవో శ్రీనివాసరావు, డిఆర్డిఏ పిడి విజయలక్ష్మి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest article

App Icon

Install Bharath Prathinidhi News App

Add to home screen for faster loading and latest updates.