స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ 2026 పట్టణాల కేటగిరిలో జాతీయ స్థాయిలో ద్వితీయ స్థానం
రాష్ట్ర స్థాయి వార్డ్ ల కేటగిరిలో తొలి స్థానం
గుంటూరు కమిషనర్ కె.మయూర్ అశోక్

గుంటూరు, 07 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : వాయు కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణలో భాగంగా గుంటూరు నగరపాలక సంస్థ ఈ-ఆటోల ద్వారా కాలుష్యరహితంగా చెత్త సేకరణ చేయడం, మెకనైజ్డ్ గా మెయిన్ రోడ్ల స్వీపింగ్, ఘన వ్యర్ధాలను సాంకేతిక విధానంలో నిర్వహించడం, డ్రైన్ టు డ్రైన్ రోడ్ల నిర్మాణం, రోడ్లపై దుమ్ము లేవకుండా నీటిని స్ప్రే చేయడం, వార్డ్ స్థాయిలోనే ఆర్ఆర్ఆర్ సెంటర్, సి&డి వ్యర్ధాల సేకరణ పాయింట్స్, క్లస్టర్ కంపోస్ట్ యూనిట్ల ద్వారా వ్యర్ధాల సమర్ద నిర్వహణతో జాతీయ స్థాయిలో విశేష ప్రతిభ కనబరిచి నేషనల్ క్లీన్ ఎయిర్ సిటీగా ప్రతిష్ఠాత్మక గుర్తింపును సొంతం చేసుకుంది. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 130 నగరాల మధ్య నిర్వహించిన ‘స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ – 2026’ పోటీల్లో గుంటూరు నగరం జాతీయ స్థాయిలో ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకుని సత్తా చాటింది. ‘స్వచ్ఛ వాయు దివస్’ సందర్భంగా న్యూఢిల్లీలోని ఇందిరా పర్యావరణ్ భవన్ (గంగా ఆడిటోరియం)లో సోమవారం ఉదయం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చైర్పర్సన్ జస్టిస్ ప్రకాష్ శ్రీవాస్తవ, కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మంత్రిత్వ శాఖ కార్యదర్శి తన్మయ్ కుమార్, అదనపు కార్యదర్శి అమన్ దీప్ గార్గ్ ల చేతుల మీదుగా గుంటూరు నగర కమిషనర్ కె.మయూర్ అశోక్, ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని స్వీకరించారు. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో వార్డ్ ల కేటగిరీ 2 (10 వేల నుండి 30వేల జనాభా) విభాగంలో గుంటూరు నగరపాలక సంస్థకు చెందిన 42వ వార్డు ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా గుంటూరు నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా వందలాది నగరాలతో పోటీపడి గుంటూరు నగరం ద్వితీయ స్థానంలో నిలవడం నగరవాసులందరికీ ఎంతో గర్వకారణమని హర్షం వ్యక్తం చేశారు. నగరంలో వాయు నాణ్యతను మెరుగుపరిచేందుకు క్షేత్రస్థాయిలో అహర్నిశలు శ్రమించిన పారిశుధ్య కార్మికులు, అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. భవిష్యత్తులో కూడా గుంటూరును మరింత పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన పచ్చని నాగ గుంటూరు నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గుంటూరు నగరపాలక సంస్థ ఎస్ఈ సుందర్రామిరెడ్డి, ఎన్విరాన్మెంట్ ఇంజినీరింగ్ స్పెషలిస్ట్ అనిల్ కుమార్, కోమలి పాల్గొన్నారు.


