డీసీఎంఎస్ చైర్మన్ వడ్డాణం హరిబాబు
శనగల కేంద్రంలో అవకతవకలకు పాల్పడిన వ్యక్తితోనే కుట్రపూరిత ఆరోపణలు
రూ. 100 కోట్లకు డీసీఎంఎస్ టర్నోవర్.. రూ. 50 లక్షల అక్రమాల రికవరీ
గుంటూరు, 26 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : డీసీఎంఎస్ (DCMS) సంస్థను అవినీతి రహితంగా తీర్చిదిద్ది, నష్టాల నుంచి లాభాల బాట పట్టిస్తుంటే ఓర్వలేక కొందరు స్వార్థపరులు తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఉమ్మడి గుంటూరు జిల్లా డీసీఎంఎస్ అధ్యక్షుడు వడ్డాణం హరిబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనగల కొనుగోలు కేంద్రాల్లో రైతుల వద్ద ముడుపులు తీసుకున్నారనే ఫిర్యాదులపై శాఖాపరమైన విచారణ ఎదుర్కొంటున్న యేసుదాస్ అనే తాత్కాలిక ఉద్యోగిని కొందరు ప్రలోభపెట్టి, కలెక్టరేట్ గ్రీవెన్స్‌కు పంపి మీడియా ముందు తప్పుడు ఆరోపణలు చేయించారని ఆయన మండిపడ్డారు. గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వడ్డాణం హరిబాబు మాట్లాడారు. రోజుకు కేవలం రూ. 650 దినసరి వేతనం (నెలకు రూ. 15,000–రూ. 16,000) వచ్చే తాత్కాలిక పోస్టులకు రూ. 5 లక్షలు లంచం తీసుకున్నారనడం అత్యంత హాస్యాస్పదమని ఖండించారు. నియామకాల్లో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, స్థానిక ఎమ్మెల్యేల సూచనల మేరకే అర్హులకు అవకాశాలు కల్పించామని స్పష్టం చేశారు.
సంస్థ ప్రగతి – సంస్కరణలు : రూ. 100 కోట్లకు చేరిన టర్నోవర్: గతంలో రూ. 70 కోట్ల లోపు ఉన్న వార్షిక టర్నోవర్‌ను ఏడాది కాలంలోనే రూ. 100 కోట్లకు తీసుకెళ్లాం. రైతులకు ఎమ్మార్పీ ధరలకే ఎరువులు అందించేందుకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అదనంగా 10 నుంచి 12 నూతన బ్రాంచీలను ప్రారంభించాం.
రూ. 11 కోట్ల పాత బకాయిల వసూలు : గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన రూ. 18 కోట్ల బకాయిల్లో సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రుల సహకారంతో రూ. 11 కోట్లను రికవరీ చేశాం.
శాశ్వత ఆదాయ వనరుల నిర్మాణం : నరసరావుపేటలో రూ. 4.5 కోట్లతో గోడౌన్, కాంప్లెక్స్ నిర్మించి నెలకు రూ. 2 లక్షల అద్దె సమకూర్చాం. గుంటూరు ఏటుకూరు రోడ్డులో ‘చంద్రన్న రైతు కన్వెన్షన్ సెంటర్’ ఏర్పాటుకు జనరల్ బాడీ ఆమోదం తీసుకున్నాం.
అక్రమార్కులపై వేటు – రూ. 50 లక్షల రికవరీ : పిడుగురాళ్ల, మాచర్ల, నెమలిపురి, సత్తెనపల్లి తదితర బ్రాంచీల్లో ఆకస్మిక ఆడిట్‌లు నిర్వహించి గుర్తించిన రూ. 50 లక్షల నిధుల గోల్‌మాల్‌ను వారం రోజుల్లో రికవరీ చేయించాం. ఇప్పటికే ముగ్గురిని సస్పెండ్ చేశాం. ధాన్యం, పప్పుధాన్యాల ప్రొక్యూర్మెంట్ ద్వారా సంస్థకు రూ. 10.5 కోట్ల కమిషన్ సమకూర్చామని, ఉద్యోగుల భద్రత కోసం నెలకు రూ. 15 లక్షల శాశ్వత ఆదాయ మార్గాలను సిద్ధం చేశామని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌ల ఆశయాలకు అనుగుణంగా రైతు సంక్షేమమే లక్ష్యంగా ముందుకెళ్తానని హరిబాబు స్పష్టం చేశారు.


