తాడేపల్లి, భారత్ ప్రతినిధి బ్యూరో : స్థానిక సంస్థ ఎన్నికల పోరుకు పార్టీ శ్రేణులంతా సిద్ధం కావాలని.. గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, ఈ రెండేళ్లలో ఈ ప్రభుత్వం ఏ ఒక్క వర్గానికీ మేలు చేయలేదని ఎత్తిచూపారు. అందుకే త్వరలో జరిగే స్థానిక ఎన్నికల్లో ఆ వ్యతిరేకత కనబడకుండా కుట్రలు చేసే వీలుందని.. అందుకు పోలీసు బలగాలనూ వినియోగించవచ్చని చెప్పారు. వైఎస్సార్సీపీకి అత్యంత ప్రజాదరణ ఉందని.. వచ్చే ఎన్నికల్లో వారే తమకు అండగా ఉంటారని, తోడుగా నిలుస్తారని అన్నారు. వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం కుట్రలను ఎదుర్కొని స్థానిక ఎన్నికల్లో పోరాడాలని.. ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపు తథ్యమని పార్టీ శ్రేణులకు ఉద్బోధించారు. ‘చంద్రబాబు ఒక విలన్. స్థానిక ఎన్నికలు సరిగ్గా జరగనీయడు. పోలీసులను పెడతాడు. దౌర్జన్యం చేస్తాడు. బెదిరిస్తాడు. ప్రలోభాలు పెడతాడు. ఎన్నికలలో దుర్మార్గంగా గెలిచే ప్రయత్నం చేస్తాడు. కానీ, అందరూ గుర్తు పెట్టుకోండి. మనకు ప్రజలు సపోర్ట్ ఉన్నారు. ఎన్నికల్లో చురుగ్గా పాల్గొనండి. అన్ని రకాలుగా మీకు పార్టీ సపోర్ట్ ఉంటుంది.
మీ జగనన్న సపోర్ట్ ఉంటాడు.” అని జగన్ పేర్కొన్నారు. ‘వాళ్ళు ఏ రకంగా మేనేజ్ చేసినా, ఏ రకంగా ఒత్తిడి తీసుకొచ్చినా, ఏ రకంగా పోలీసులను పెట్టుకొని ఏం చేసినా కూడా యుద్ధం మాత్రం జరగాలి.’ అని అన్నారు. ఒకవేళ పోలీసులను దుర్వినియోగం చేసి, ఆ చిన్న చిన్న స్థానాల్లో సైతం గెలవడం కోసం వాళ్ళు దుర్మార్గాలు చేస్తే మాత్రం రేపు పొద్దున జరగబోయే ఎన్నికల్లో చంద్రబాబుగారి పునాదులు కూడా కదిలే విధంగా కసి పెరుగుతుంది అనేది మాత్రం గుర్తు పెట్టుకోవాలని ఆయన అన్నారు. ‘అందుకే కచ్చితంగా గట్టిగా పోటీ ఎదుర్కొందాం. ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి ఇంకొక సంవత్సరంలో జగనన్న పాదయాత్ర స్టార్ట్ అవుతుంది. ఇంకొక సంవత్సరంలో ఎన్నికలు జరుగుతాయి. ఆ విధంగా మనకు మనం ట్యూన్ చేసుకుందాం. గట్టిగా యుద్ధం చేద్దాం. గెలుపు మనదే’ అని జగన్ పేర్కొన్నారు.
స్థానిక సమరానికి ‘సై’


