గుంటూరు, 25 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఐదేళ్ల కాలంలో గుంటూరు ప్రభుత్వ మహిళా కాలేజీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని, కాలేజీకి మహర్దశ తీసుకొచ్చే బాధ్యత తనదేనని తూర్పు ఎమ్మెల్యే, అసెంబ్లీ మైనారిటీస్ కమిటీ చైర్మన్ నసీర్ అన్నారు. మంగళవారం స్థానిక మహిళా ఇంటర్ కళాశాలలో గ్రౌండ్ లెవలింగ్, ఇంటర్నల్ డ్రెయిన్ల నిర్మాణానికి రూ.31 లక్షలతో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నసీర్ మాట్లాడుతూ, గుంటూరు జిల్లాలోనే ప్రత్యేక గుర్తింపు పొందిన మహిళా కళాశాలను అభివృద్ధి చేయడం సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వ మహిళా కళాశాలకు మహర్దశ తీసుకొచ్చేందుకు సహకారం అందించిన విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్, కలెక్టర్ సాయికాంత్ వర్మకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిండమే కాకుండా విద్యారంగంలో ఉన్నతంగా ఎదిగేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ మహిళా కళాశాల ప్రాంగణంలో అన్ని విభాగాలను బలోపేతం చేస్తామన్నారు. ప్రపంచ దేశాలు మన వైపు చూడాలంటే విద్య ద్వారానే సాధ్యమని చెప్పారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తోందని తెలిపారు. విద్యార్థులకు ప్రభుత్వం జవాబుదారీతనంగా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ మహిళా కళాశాలలో అధ్యాపకులు నిబద్ధతతో పని చేస్తారని, ఇలాంటి గురువుల మార్గంలో విద్యార్థులు నడిచి కెరీర్ ను మలుచుకోవాలని సూచించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. ప్రతి పాఠశాలలో విద్యార్థుల విద్యా సామర్థ్యాలు పెంచేందుకు తగిన చర్యలు చేపడుతున్నామని చెప్పారు. గుంటూరు మహిళా కాలేజీలో విద్యనభ్యసించిన విద్యార్థినులు ఎన్నో విజయాలు సాధించారని, వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఇంటర్ లో చేరే టర్మీడియట్లో చేరే విద్యార్థినులకు ‘తల్లికి వందనం’ పథకం ద్వారా ప్రోత్సాహం అందిస్తున్నామని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఉమాదేవి, కూటమి నాయకులు పోతురాజు సమత, కొనకళ్ల సత్యం చంద్ర, మండవ శ్రీనివాస్, శనక్కాయల రాజకుమారి, టీ పద్మావతి, వలి తదితరులు పాల్గొన్నారు.


