ఇంటర్నెట్ డెస్క్, భారత్ ప్రతినిధి : హర్యానాలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ముసుగు ధరించిన నలుగురు దొంగలు ఒక లాయర్ ఇంట్లోకి చొరబడి రూ.3.15 కోట్ల విలువైన నగలు, డబ్బుతో ఉడాయించారు. కురుక్షేత్రలో గురువారం సాయంత్రం ఈ ఘటన వెలుగు చూసింది. బాధితుడు, సీనియర్ అడ్వొకేట్ బల్వంత్ సింగ్ వాలియా థానేసర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుడి కథనం ప్రకారం, గురువారం రాత్రి పెంపుడు శునకంతో కలిసి బయటకు వెళ్లిన ఆయన 9.30 గంటలకు తిరిగొచ్చేసరికి ఇంట్లో షాకింగ్ దృశ్యం కనిపించింది. అప్పటికి ఇంట్లో ఉన్న దుండగులు ఆయన భార్య చేతులు కాళ్లు కట్టేసి మంచంపై పడేశారు. ఆమె మాట్లాడలేకుండా నోటికి గమ్ టేప్ చుట్టారు. ఆ తరువాత న్యాయవాదిని కూడా గన్నుతో బెదిరించి కదలకుండా తాళ్లతో కట్టేశారు. డిజిటల్ లాకర్‌ను ఓపేన్ చేయలేక ఇబ్బంది పడ్డ దుండగలు లాయర్‌తోనే వాటిని తెరిపించి డబ్బును లాక్కున్నారు. లాకర్‌లు తెరవకుంటే తుపాకీతో కాల్చి చంపేస్తామని బెదిరించారు. దీంతో భయపడ్డ న్యాయవాది వారు చెప్పినట్టే చేశారు.


