Friday, September 11, 2026
spot_imgspot_img

నేపాల్‌ వరద బీభత్సం.. ఏపీ వాసులు ఏడుగురు గల్లంతు

Must read

📰 Generate e-Paper Clip

నేపాల్‌ వరద బీభత్సం తర్వాత దొరకని జాడ

ఫోన్లు స్విచ్చాఫ్‌ కావడంతో కుటుంబాల్లో టెన్షన్‌

ప్రతికూల వాతావరణంతో కొందరికి అస్వస్థత

పరిస్థితిని సమీక్షిస్తున్న మంత్రి లోకేశ్‌

అమరావతి, 27 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి బ్యూరో : నేపాల్‌ వరద బీభత్సం ఏపీలో కల్లోలం రేపుతోంది. కైలాస మానస సరోవర యాత్రకు వెళ్లిన తమవారి క్షేమ సమాచారం 24 గంటలుగా దొరక్క, వారి కుటుంబాలు కలత చెందుతున్నాయి. భయపెడుతున్న వరద సమాచారం, ఆ విపత్తు చోటుచేసుకున్న ప్రాంతాల్లోనే ఏపీ యాత్రికులు ఉన్నట్టు తెలుస్తుండటంతో ఏ క్షణాన ఏ కబురు వినాల్సి వస్తోందోనని కలవరపడుతున్నాయి. ఫోన్లు స్విచ్చాఫ్‌లు కావడం మరింత టెన్షన్‌కు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. విపత్తులో చిక్కుకున్న రాష్ట్ర వాసుల వివరాలను సేకరించే పనిలో ఆర్టీజీఎస్‌ అధికారులు నిమగ్నమయ్యారు. ప్రాథమికంగా అధికారులు సేకరించిన వివరాల మేరకు ఏడుగురు ఏపీ వాసులు గల్లంతయ్యారు. నేపాల్‌లో చిక్కుకున్న ఏపీవాసుల క్షేమ సమాచారంపై మంత్రి లోకేశ్‌ గురువారం సమీక్ష నిర్వహించారు. గల్లంతైన వారి ఆచూకీ కనుగొనేందుకు కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సం ప్రదింపులు జరపాలని అధికారులను ఆదేశించారు. కైలాస మానస సరోవర యాత్రకు వెళ్లి వరదల్లో చిక్కుకున్నా, క్షేమంగానే ఉన్న కర్నూలు జిల్లాకు చెందిన భాస్కర్‌శాస్త్రి సహా అందరినీ రాష్ట్రానికి తరలించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు ఆర్టీజీఎస్‌ కేంద్రం నుంచి ఐటీ కార్యదర్శి కాటంనేని భాస్కర్‌ నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

ఎక్కువ మంది ఈశా ఫౌండేషన్‌ సభ్యులే..
నేపాల్‌ వరదల్లో గల్లంతైన తెలుగువారిలో అత్యధికులు ఈశా ఫౌండేషన్‌ ద్వారా నేపాల్‌ వెళ్లిన వారే కావడం గమనార్హం. ప్రాథమిక సమాచారం మేరకు, ఈశా ఫౌండేషన్‌ ద్వారా వెళ్లినవారిలో ఆరుగురు గల్లంతయ్యారు. వీరితోపాటు ఎన్టీఆర్‌, ప్రకాశం జిల్లాలకు చెందిన వారు కూడా గల్లంతయినట్లు సమాచారం. ఈశా ఫౌండేషన్‌ ద్వారా వెళ్లిన వారిలో.. వెన్నెలగంటి బాలసుబ్రమణ్యం, కుప్పం, చిత్తూరు జిల్లా, అట్లూరి శశికుమార్‌, ఎన్‌ఆర్‌ఐ, నిమ్మగడ్డ రాజ్యలక్ష్మి, ఎన్‌ఆర్‌ఐ, అన్నందేవర వెంకట్రామ్‌, కాకినాడ, అన్నందేవర అనగ, కాకినాడ, కాకాని అపర్ణ, గుంటూరు ఉన్నారు. వీరితోపాటు ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి చొప్పవరపు రమేశ్‌ బాబు ఉన్నారు.
కంట్రోల్‌ రూం ఏర్పాటు నేపాల్‌లో చిక్కుకున్న వారి కోసం ఢిల్లీలోని ఏపీ భవన్‌లో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశారు. బాధితుల సమాచారం తెలిసినా, బాధితులు తమ క్షేమ సమాచారాన్ని తెలియజేయాలనుకున్నా 011-23384016, 23387089 నంబర్లకు సంప్రదించాలని అధికారులు కోరారు. వాట్సాప్‌ నంబరు 90598 24101 కూ సంప్రదించవచ్చని కోరారు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest article

App Icon

Install Bharath Prathinidhi News App

Add to home screen for faster loading and latest updates.