రాజీవ్, మేఘన దంపతుల వివాదంపై మాజీ మంత్రి జోగి రమేష్ స్పందన
ఇబ్రహీంపట్నం, 24 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గత నెల రోజులుగా తాను, తన కుటుంబ సభ్యులు తీవ్ర మానసిక క్షోభకు గురయ్యామని మాజీ మంత్రి, వైసీపీ మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇబ్రహీంపట్నంలోని తన నివాసంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తన కుటుంబంపై గత నెల రోజులుగా జరుగుతున్న ప్రచారం, తన కుమారుడు రాజీవ్, మేఘన మధ్య వివాదం, పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు తదితర అంశాలపై జోగి రమేష్ భావోద్వేగంతో స్పందించారు. తల్లిదండ్రులుగా పిల్లలను పెంచడం, చదివించడం, వారికి వివాహం చేయడం తమ బాధ్యత అన్నారు. ఆ బాధ్యతలో భాగంగానే తన కుమారుడు రాజీవ్‌కు మేఘనతో ఘనంగా వివాహం జరిపించామని తెలిపారు. అయితే రాజీవ్, మేఘన మధ్య కొన్ని మనస్పర్థలు, భేదాభిప్రాయాలు వచ్చాయని చెప్పారు. పిల్లలు కలిసి ఉండాలని తల్లిదండ్రులుగా తాము కోరుకుంటామని, విడిపోవాలని ఎప్పుడూ కోరుకోమని జోగి రమేష్ అన్నారు. 2026 జూన్ 8న తన కుమారుడు విడాకుల కోసం కోర్టును ఆశ్రయించాడని, జూలై 24న మేఘన తన కుటుంబ సభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వివరించారు. విడాకుల వ్యవహారం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నందున ఈ అంశంపై తాను ఎక్కువగా మాట్లాడలేనని చెప్పారు. రాజీవ్, మేఘన మధ్య సమస్యలు వచ్చి ఉండొచ్చని, అయితే మేఘనను తమ కుటుంబం కూతురిలా చూసుకుందని తెలిపారు. కుటుంబ వివాదాన్ని వ్యక్తిగతంగా పరిష్కరించుకోవాల్సిన అంశంగా తాము భావిస్తున్నామని పేర్కొన్నారు.
గత నెల రోజులుగా తమ కుటుంబాన్ని మానసికంగా వేధించేలా కొన్ని కథనాలు ప్రసారం చేశారని జోగి రమేష్ ఆరోపించారు. కొన్ని ప్రసార మాధ్యమాలు తమ కుటుంబంపై వార్తలు ప్రసారం చేసి వ్యాపారం చేసుకున్నాయని విమర్శించారు. తమ కుటుంబానికి కూడా భావోద్వేగాలు, బంధాలు ఉన్నాయని పేర్కొంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబంపై మతమార్పిడికి ప్రయత్నించారంటూ ప్రచారం చేశారని ఆరోపించారు. తన భార్య బైబిల్ చదవడం తప్పా, ఏసుక్రీస్తు బోధనలు వినడం తప్పా అని ప్రశ్నించారు. తాము తిరుపతి, దుర్గగుడికి వెళ్తామని, యాగాల్లో కూడా పాల్గొంటామని తెలిపారు. తన కుటుంబాన్ని మానసికంగా వేధించి రాజకీయంగా లబ్ధి పొందడం ఏమిటని చంద్రబాబు, లోకేష్‌ను జోగి రమేష్ ప్రశ్నించారు. ఐటీడీపీ ద్వారా నెల రోజులుగా తమ కుటుంబంపై ప్రచారం చేశారని ఆరోపించారు. వ్యక్తిగత విషయాల్లోకి రావద్దని, చేతనైతే రాజకీయంగా తనపైకి రావాలని సవాల్ విసిరారు. ఎన్నికలు పూర్తయిన రెండు నెలలకే తన కుమారుడిని అరెస్టు చేయించారని ఆరోపించారు. కల్తీ మద్యం కేసులో తనను, తన తమ్ముడిని 83 రోజులు జైలులో పెట్టారని పేర్కొన్నారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తన ఇంటిపై దాడి చేయించారని ఆరోపించారు. ఇన్ని ఇబ్బందులు ఎదురైనా తాను భయపడలేదని, తన గొంతు నొక్కాలని ఎంత ప్రయత్నించినా వెనక్కి తగ్గబోనని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్నందుకే తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నారని జోగి రమేష్ ఆరోపించారు. ఏ కుటుంబంలో సమస్యలు లేవో చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్, చిరంజీవి వంటి ప్రముఖుల కుటుంబాల్లో కూడా సమస్యలు ఉండవా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వ్యక్తిగత విషయాలపై తాను ఎప్పుడూ మాట్లాడలేదని తెలిపారు. ఎమ్మెల్యే వసంత కార్యాలయంలో రాజకీయాలు చేయడం సమంజసమేనా అని ప్రశ్నించారు. తాను దమ్ముగా రాజకీయాలు చేస్తానని, వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లనని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే వసంత ఇలాంటి రాజకీయాలు మానుకోవాలని సూచించారు.
తనపై ఇన్ని కుట్రలు ఎందుకు చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ను జోగి రమేష్ ప్రశ్నించారు. రాజకీయ విమర్శలకు పరిమితులు ఉండాలని అన్నారు. కుటుంబ వివాదాలను రాజకీయాల కోసం రోడ్డుపైకి తీసుకురావద్దని కోరారు. తాను దేనినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ పేరుతో తన కుటుంబాన్ని ఎక్కువగా లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. తన గొంతు నొక్కాలని ఎంతగా ప్రయత్నించినా ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు. మహా టీవీ వంశీని ఉద్దేశించి కూడా జోగి రమేష్ పలు వ్యాఖ్యలు చేశారు. మంత్రి లోకేష్ రెడ్ బుక్ పేరుతో విర్రవీగవద్దని జోగి రమేష్ అన్నారు. ఈరోజు రెడ్ బుక్.. రేపు డెత్ బుక్ అవుతుందని వ్యాఖ్యానించారు. తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని, సమయం వచ్చినప్పుడు అన్నింటినీ బయటపెడతానని స్పష్టం చేశారు. అధికారం ఉంటే ప్రజలకు మంచి చేయాలని, వ్యక్తిగత కుటుంబ వివాదాలను రాజకీయ ఆయుధాలుగా ఉపయోగించవద్దని సూచించారు. తమ కుటుంబంపై నెల రోజులుగా వార్తలు ప్రసారం చేసిన ప్రసార మాధ్యమాలు, యూట్యూబ్ ఛానళ్ల తీరుపై కూడా ఆయన ప్రశ్నలు సంధించారు. రాజకీయ పోరాటాన్ని రాజకీయంగానే ఎదుర్కోవాలని, వ్యక్తిగత కుటుంబ విషయాలను అందులోకి తీసుకురావద్దని కోరారు.


