BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 11 September 2026, 8:38 am Posted by : Raghunath Rolla

విద్యార్థులకు న్యాయం చేస్తాం : ‎ఎమ్మెల్యే నసీర్

గుంటూరు, 10 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు జిల్లాలో బీఎస్సీ ఎంఎల్ టీ & ఏఎహెచ్ ఎస్ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని, గత జగన్ ప్రభుత్వంలో వైఫల్యాలు కారణంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే అసెంబ్లీ మైనార్టీస్ కమిటీ చైర్మన్ నసీర్ అన్నారు. గురువారం స్థానిక తూర్పు కార్యాలయంలో విద్యార్థులు ఎమ్మెల్యే నసీర్ని కలిసి వినతిపత్రం అందజేశారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలన్నారు. ‎నాలుగేళ్లలో పూర్తి కావాల్సిన బీఎస్సీ ఎంఎల్ టీ& ఎలైడ్ హెల్త్ సైన్సు కోర్సులు అనేక కారణాల వల్ల ఆరు సంవత్సరాలకు పొడిగించారని, పరీక్షల నిర్వహణ, ఫలితాల విడుదలలో తీవ్ర జాప్యంతో ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలను కోల్పోతున్నామని వివరించారు. విద్యార్థుల భవిష్యత్తుతో సంబంధిత విశ్వవిద్యాలయాలు, కళాశాల యాజమాన్యాలు చెలగాటమాడుతున్నాయని తెలిపారు. కోర్సులను సకాలంలో పూర్తి చేయాల్సిన విద్యార్థులు సంవత్సరాల తరబడి అకడమిక్ ప్రక్రియ పూర్తికాక ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ‎ఇంటర్న్‌షిప్ సమయంలో విద్యార్థులు ఆసుపత్రులు, ల్యాబొరేటరీలు మరియు ఇతర ఆరోగ్య సేవా విభాగాల్లో సేవలందిస్తున్నప్పటికీ వారికి ఎలాంటి తగిన ఆర్థిక భద్రత లేదన్నారు వెంటనే నెలకు రూ.15 వేలు స్టైపెండ్ చెల్లించాలని డిమాండ్ చేశారు. 2021 బ్యాచ్ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ కాలానికి సంబంధించిన తగిన స్టైపెండ్ చెల్లించాలన్నారు. అన్ని కోర్సులకు స్పష్టమైన అకడమిక్ క్యాలెండర్‌ను ప్రకటించాలన్నారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే నసీర్ హామీ ఇచ్చారు.