BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 06 September 2026, 1:19 am Posted by : Raghunath Rolla

హోటళ్లపై వీఎంసీ కొరడా

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు.. రూ.26 వేల జరిమానా

విజయవాడ, 05 సెప్టెంబర్‌ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : నగరంలోని హోటళ్లు, టిఫిన్‌ సెంటర్లు, ఆహార విక్రయ కేంద్రాలపై వీఎంసీ ప్రజారోగ్య విభాగం అధికారులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. కమిషనర్‌ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు చేపట్టిన తనిఖీల్లో ఆహార నాణ్యత, పరిసరాల పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణ, సిబ్బంది వ్యక్తిగత పరిశుభ్రతను పరిశీలించారు. అంబేద్కర్‌ కాలనీ 3వ లైన్‌లోని ప్రియా ఎగ్జిక్యూటివ్‌ బాయ్స్‌ హాస్టల్‌ను తనిఖీ చేసి నిబంధనలు పాటించకపోవడంతో రూ.1,000 జరిమానా విధించారు.

37వ డివిజన్‌ పరిధిలోని పండిట్‌ నెహ్రూ బస్‌స్టాండ్‌ ప్రాంతంలో మిలిటరీ క్యాంటీన్‌, బాలాజీ షిర్డీ హోటల్‌, షిర్డీ క్యాంటీన్‌, శంకర్‌ విలాస్‌, శ్రీరామ ఫాస్ట్‌ఫుడ్స్‌ తదితర ఆహార విక్రయ కేంద్రాలను తనిఖీ చేశారు. నిబంధనలు పాటించని ఐదు దుకాణాలకు రూ.5,000 చొప్పున రూ.25,000 జరిమానా విధించారు. దుర్గాపురం డొంక రోడ్‌ ప్రాంతంలోని ఇడ్లీ, దోస హోటళ్లను కూడా తనిఖీ చేసి ఆహార పదార్థాల నాణ్యత, పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణను పరిశీలించారు. హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్‌ సెంటర్ల నిర్వాహకులు తప్పనిసరిగా పరిశుభ్రత ప్రమాణాలు పాటించాలని, నాణ్యమైన ఆహారాన్ని మాత్రమే ప్రజలకు అందించాలని అధికారులు సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానాలతో పాటు అవసరమైన తదుపరి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తనిఖీల్లో శానిటరీ సూపర్‌వైజర్లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, ప్రజారోగ్య సిబ్బంది పాల్గొన్నారు.