రూ.7.40 లక్షల విలువైన 120 లీటర్లకు స్టాప్ సేల్
గుంటూరు, 03 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల అక్రమ రవాణాపై గుంటూరు ప్రాంతీయ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు కొరడా ఝళిపించారు. గుంటూరు-1 డివిజన్ జీఎస్టీ, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి ఆర్.అగ్రహారంలోని శ్రీ పల్నాడు డైలీ ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో ఎటుకూరు రోడ్డులోని మహీంద్రా సమ్మిట్ అగ్రో సైన్సెస్ లిమిటెడ్‌కు చెందిన అనుమానాస్పద పురుగుమందుల నిల్వలను అధికారులు గుర్తించారు. వాటికి సంబంధించిన తప్పనిసరి రికార్డులు, పత్రాలు సక్రమంగా నిర్వహించలేదని వెల్లడించారు. పురుగుమందుల లైసెన్స్‌కు అవసరమైన ప్రిన్సిపల్ సర్టిఫికెట్లు కూడా చేర్చలేదని గుర్తించారు. ఈ ఉల్లంఘనలు ఇన్‌సెక్టిసైడ్స్ రూల్స్–1971 నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీంతో మహీంద్రా సమ్మిట్ మహాగార్డ్‌కు చెందిన రూ.7.40 లక్షల విలువైన 120 లీటర్ల పురుగుమందులపై విక్రయ నిలుపుదల (స్టాప్ సేల్) నోటీసు జారీ చేశారు. అలాగే పురుగుమందుల నమూనాలను సేకరించి నాణ్యత నిర్ధారణ కోసం ప్రయోగశాలకు పంపేందుకు చర్యలు చేపట్టారు. తనిఖీల్లో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, వ్యవసాయ, జీఎస్టీ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.