BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 01 September 2026, 7:25 am Posted by : Raghunath Rolla

ఎన్.హెచ్.ఎ.ఐ అధికారులతో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని సమీక్ష

గుంటూరు, 01 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్‌ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో ఎన్ హెచ్ ఎ ఐ రీజినల్ ఆఫీసర్, ప్రాజెక్ట్ డైరెక్టర్‌లతో పెమ్మసాని క్యాంప్ కార్యాలయంలో సమీక్ష సమావేశం మంగళవారం నిర్వహించారు. గుంటూరు – విజయవాడ పరిసర ప్రాంతాల్లో జాతీయ రహదారులకు సంబంధించిన కీలక సమస్యలు, పెండింగ్‌ పనుల పురోగతిపై ఈ సందర్భంగా అధికారులతో కేంద్ర మంత్రి సమగ్రంగా చర్చించారు. సమావేశంలో ప్రధానంగా వెస్ట్ బైపాస్‌పై చిన్నకాకాని ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించిన డి పి ఆర్ తయారీ, తదుపరి కార్యాచరణ, కాలపట్టికపై సమీక్షించారు. ఔటర్ రింగ్ రోడ్ ప్రతిపాదనలు, కేంద్ర ప్రభుత్వానికి పంపిన నివేదికలు, పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సుద్దపల్లి డొంక వద్ద ఆర్ యు బి /డ్రెయిన్ అవుట్‌లెట్, వెంకటపాలెం టోల్ ప్లాజా సమస్యలు, పెదకాకాని వై జంక్షన్‌ను ప్రమాద రహిత ప్రాంతంగా తీర్చిదిద్దే చర్యలు తదితర అంశాలపై కూడా చర్చ జరిగింది. అదేవిధంగా కొలనుకొండ, సుద్దపల్లి డొంక వద్ద నిర్మాణంలో ఉన్న రెండు ఆర్ఓబిల పనులు నెమ్మదిగా సాగుతున్న అంశంపై మంత్రి ఆరా తీశారు. పనులను వేగవంతం చేసి ప్రజలకు త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. అమృత్‌ 2.0 పథకం కింద పైప్‌లైన్ల ఏర్పాటుకు అవసరమైన అనుమతులు మంజూరు చేసే అంశంపైనా సమీక్షించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా రహదారి మౌలిక వసతుల పనులను వేగవంతం చేయడం, ప్రమాదాలను నివారించడం, పెండింగ్‌ సమస్యలకు త్వరిత పరిష్కారం చూపడమే లక్ష్యంగా అధికారులతో మంత్రి పెమ్మసాని సమీక్షించారు. ఈ సమావేశంలో నేషనల్ హైవేస్ రీజినల్ ఆఫీసర్ హరికృష్ణ, ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ సుర్జేవాలా మరియు జనరల్ మేనేజర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.